ఒక్క అవకాశం ఇవ్వండి..టీచర్ల సమస్యలపై మండలిలో కొట్లాడి పరిష్కరిస్తా : మల్క కొమరయ్య

ఒక్క అవకాశం ఇవ్వండి..టీచర్ల సమస్యలపై మండలిలో కొట్లాడి పరిష్కరిస్తా : మల్క కొమరయ్య
  • కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
  • కామారెడ్డి, నిజామాబాద్​, మెదక్​ జిల్లాల్లో ప్రచారం

మెదక్​/ కామారెడ్డి / నిజామాబాద్, వెలుగు​: తనకు ఒక అవకాశం ఇస్తే.. టీచర్ల సమస్యలపై శాసన మండలిలో కొట్లాడి పరిష్కరిస్తానని కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య తెలిపారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు టీచర్ల సమస్యలపై గొంతెత్తలేదన్నారు. అందుకే సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గురువారం ఆయన కామారెడ్డి, నిజామాబాద్, మెదక్​ జిల్లాలో ప్రచారం చేశారు.

రామయంపేట టౌన్ లో టీచర్ల ఇండ్లకు వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల  సమస్యలను చాయ్ తాగే టైమ్ లో పరిష్కరిస్తామని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి .. ప్రస్తుతం ముఖ్యమంత్రిగానూ సాల్వ్ చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. నెల రోజులు సమగ్ర శిక్ష ఉద్యోగులు ధర్నా చేసినా ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో పాటు జీతం కూడా ఇంకా రాకపోవడం దారుణమన్నారు.

కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తపస్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్​మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ టీచర్లకు 010  కింద జీతాలు ఇవ్వాలన్నారు.  కేంద్రం పాత పెన్షన్ లోకి తీసుకొచ్చినప్పటికీ రాష్ట్ర సర్కార్ తీసుకురాకపోవడం అన్యాయమన్నారు.

వెంటనే 2003 కంటే  ముందున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా తపస్​ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డు ఎల్లం, చల్లా లక్ష్మణ్, రామాయంపేట మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, తపస్ జిల్లా బాధ్యులు ప్రవీణ్, సాంగని యాదగిరి, మన్నె గోపాల్, సతీశ్​తదితరులు ఉన్నారు. 

టీఎస్​టీఈయూ మద్దతు

ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థికి ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నుంచి మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పదికి పైగా సంఘాలు సంపూర్ణ స్వచ్ఛంద మద్దతు ప్రకటించాయి. గురువారం తెలంగాణ గిరిజన ఉద్యోగ సంఘం(టీఎస్​ టీఈయూ) మద్దతు తెలిపింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాథోడ్​అశోక్​ సింగ్​,సంతోష్​ నాయక్ ​మద్దతు పత్రాన్ని అభ్యర్థి   మల్క       కొమరయ్యకు అందజేశారు.