ఎమ్మెల్సీ క్యాండిడేట్లకు ఖర్చుల ఫికర్

ఎమ్మెల్సీ క్యాండిడేట్లకు ఖర్చుల ఫికర్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ క్యాండిడేట్లను ఖర్చుల దడ వెంటాడుతోంది. మూడేళ్ల పదవి కోసం జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి సుమారు రూ. 30 కోట్ల నుంచి35 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలోని ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 31న ఉప ఎన్నికలు జరుగన్నాయి. నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాండిడేట్లు పోటా పోటీగా ముందుకు సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలని పార్టీలు ఆర్థికంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్అఫిషియో సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. అయితే జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఉవ్విళ్లూరుతున్నారు.

ఖర్చు పెట్టినా లాభం ఉంటుందా?

రాష్ట్రంలో మొత్తం 2799 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1086, ఉమ్మడి వరంగల్​ జిల్లాలో 902, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 811 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంపీటీసీ ఓటర్లే అత్యధికం. ఓటర్లకు రూ. రెండు లక్షలతోపాటు, క్యాంపులు, టూర్లు తదితర ఖర్చులతో కలిసి సగటును ఒక్కో అభ్యర్థికి రూ. 30 నుంచి 35 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కనీసం అంత ఖర్చు పెడితే గెలుస్తమో.. లేదో అనే నమ్మకం కూడా లేదని పలువురు అభ్యర్థులు తమ అనుచరుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.

ఓటర్లకు మస్తు డిమాండ్​

2015లో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. 2014  జనరల్​ ఎన్నికల తర్వాత జరిగిన ఎలక్షన్లు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అప్పట్లో ఈ మూడు స్థానాల్లో రంగారెడ్డి, వరంగల్‌ సీట్లను టీఆర్‌ఎస్‌, నల్గొండ సీటును  కాంగ్రెస్​ గెలుచుకున్నాయి. అప్పట్లో ఎన్నికలకు చాలా ముందు రోజుల నుంచే క్యాంపు రాజకీయాలు నడిచాయి. కొందరు అభ్యర్థులైతే తమకే ఓటు వేస్తారనుకున్న ఓటర్లకు ఏకంగా ఏడాది ముందే లక్ష చొప్పున ముట్టజెప్పినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. నాడు ఓటుకు సుమారు రూ. రెండు లక్షల వరకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో  ఓటర్లకు ఫుల్లు డిమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘మరికొన్ని రోజుల్లో మా పదవి అయిపోతుంది. ఉన్నన్ని రోజులు ఏం సంపాదించుకోలేదు. నిధులు కూడా పెద్దగా రాలేదు. ఏ పార్టీ రూ. రెండు లక్షలు ఇస్తే ఆ పార్టీకే ఓటు వేస్తాం’’ అని కొందరు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఏకంగా ఓటుకు రూ. 5 లక్షలు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.