గెలిస్తే ఏం చేస్తామో చెప్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు

గెలిస్తే ఏం చేస్తామో చెప్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు

రాష్ట్రంలో గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. విమర్శలు, ప్రతివిమర్శలు, హామీలతో క్యాంపెయిన్‌‌‌‌ మొత్తం హాట్‌‌‌‌హాట్‌‌‌‌గా సాగింది. నిరుద్యోగం, ఉద్యోగుల సమస్యలపై అందరి దృష్టి ఉండటంతో అభ్యర్థులంతా వీటిపైనే ఫోకస్‌‌‌‌ పెట్టారు. తాము గెలిస్తే.. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఏమేం చేస్తామో చెప్పే ప్రయత్నం చేశారు. అందరి మాటలు విన్న గ్రాడ్యుయేట్‌‌‌‌ ఓటర్లు ఓటెవరికో చెప్పకుండా సైలెంట్‌‌‌‌గా ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ రేగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిస్తే ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం చేశారు.

సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉన్న
సిట్టింగ్ ఎమ్మెల్సీగా ప్రజల్లోనే ఉన్నా. కొత్తగా నేను ప్రచారం చేసుకోవాల్సిన పని లేదు. బీజేపీ కార్యకర్తలే నా బలం. కచ్చితంగా గెలుస్తా. ఇది ఓవర్‌‌‌‌కాన్ఫిడెన్స్​ కాదు. నాకు పోటీగా సరైన ప్రత్యర్థే లేరు. రెండో స్థానంలో ఎవరుంటారని మిగతా అభ్యర్థులు తేల్చుకోవాలి. ఆరేండ్లలో ప్రజా సమస్యలపై కౌన్సిల్‌‌‌‌లో గొంతు వినిపించా. స్టూడెంట్ల నుంచి రైతుల వరకు, విద్యారంగం నుంచి ఆరోగ్య రంగం వరకు అన్ని సమస్యలపై మాట్లాడాను. లాయర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం 2015లో రూ.100 కోట్లు కేటాయించింది. వాటిని ఎక్కడ పెట్టారో తెలియదు. నేను వాటి గురించి ప్రశ్నించాకే 2017లో ఆ డబ్బును అడ్వొకేట్ల సంక్షేమం కోసం సర్కార్​ ఖర్చు చేయడం మొదలుపెట్టింది. అడ్వొకేట్లకు ఇండ్ల పట్టాలు, జీపీలు, పీపీలకు జీతాల విషయంలో, పండిట్ల ప్రమోషన్లు, టీచర్ల ప్రమోషన్లపై, క్రీడాకారుల కోచ్‌‌‌‌ల జీతాల పెంపు, నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన. ఫలితంగా పండిట్లకు ప్రమోషన్లు వచ్చాయి. కోచ్‌‌‌‌లకు సాలరీలు పెరిగాయి. మల్కాజ్‌‌‌‌గిరి రోడ్ ఓవర్‌‌‌‌​బ్రిడ్జి విషయంలో, రోడ్ల నిర్మాణ విషయంలో మాట్లాడడం వల్లే ప్రభుత్వం పనుల వేగం పెంచింది. సురభి వాణిని పోటీలో నిలిపి మా సామాజిక వర్గం ఓట్లు చీల్చవచ్చని టీఆర్ఎస్ ​వేసుకుంటున్న లెక్కలన్నీ తప్పే. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరం. సరైన ప్రతిపక్ష పాత్ర నిర్వర్తిస్తున్న బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.
- ఎన్‌‌‌‌.రాంచందర్‌‌‌‌రావు, బీజేపీ

గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్త
నా తండ్రి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు నాకు ధర్మమార్గాన్ని సూచించారు. ఆయన వారసురాలిగా నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్న. 31 సంవత్సరాలుగా నేను విద్యారంగంలో ఉండటంతో అన్ని అంశాలపై నాకు అవగాహన ఉంది. నిరుద్యోగుల బాధలు, ఉద్యోగుల సమస్యలు నాకు తెలిసినంతగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిల్చున్న ఏ ఒక్క అభ్యర్థికీ తెలియవు. మండలిలో నా వాణిని వినిపిస్తూ ప్రభుత్వానికి, ఉద్యోగులు, నిరుద్యోగులకు మధ్య వారధిగా ఉంటా. ప్రశ్నించే వాళ్లను కాకుండా సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా నాకు మద్దతు ఇవ్వండి. ఎమ్మెల్సీగా నాకు ఒకసారి అవకాశమిస్తే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా.
- సురభి వాణి, టీఆర్ఎస్​

ప్రభుత్వ విధానాలతోనే పోటీ 
గతంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశా. ఆ సమయంలో అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, వాటి పరిష్కారానికి కృషి చేశా. నేను ఎమ్మెల్సీ అయ్యే సమయానికి రంగారెడ్డి జిల్లాలో ఒక్క సర్కారు డిగ్రీ కాలేజీ కూడా లేదు. డిగ్రీ కాలేజీల ఏర్పాటు కోసం అనేక పోరాటాలు చేశాను. వాటి ఫలితంగానే రంగారెడ్డికి 4 డిగ్రీ కాలేజీలు మంజూరయ్యాయి. హైదరాబాద్‌‌‌‌​సిటీకి ఏ1 స్టేటస్‌‌‌‌​రావడంలో నా పాత్ర కీలకం. దీంతో ఉద్యోగులందరికీ హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏ పెరిగింది. సిటీ డెవలప్​మెంట్‌‌‌‌కు నిధులూ వచ్చాయి. స్టేట్‌‌‌‌లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పీఆర్సీ కోసం, ప్రమోషన్లు, బదిలీలు, కారుణ్య నియామకాల కోసం పోరాడతా. ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గ్రాడ్యుయేట్లు తప్పకుండా నన్ను గెలిపిస్తారనే నమ్మకం ఉంది.
- కె.నాగేశ్వర్, ఇండిపెండెంట్‌‌‌‌​ అభ్యర్థి

నిరుద్యోగుల పక్షాన కొట్లాడతా
తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని భర్తీ చేయలేదు. దీంతో లక్షలాది మంది యువత రోడ్లపై తిరుగుతున్నారు. తెలంగాణ రావడానికి ఎవరినైతే వాడుకున్నారో వారినే ఇప్పుడు పక్కనపెట్టారు. మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. బయట ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ, యూత్‌‌‌‌​కాంగ్రెస్‌‌‌‌ పోరాటం చేస్తున్నాయి. కేంద్రంలో మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ లెక్కన గత ఏడేండ్లలో మన దేశంలో 14 కోట్ల ఉద్యోగాలు యువతకు దక్కాల్సి ఉండె. అందులో కనీసం 50 లక్షలు మన రాష్ట్రంలో రావాల్సి ఉండే. కానీ 5 వేల ఉద్యోగాలు కూడా రాలే. నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకగా మండలిలో గళం వినిపిస్తా. ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్‌‌‌‌కు ఓటమి తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తానన్న నమ్మకం ఉంది.
- చిన్నారెడ్డి, కాంగ్రెస్

ప్రభుత్వాన్ని నిలదీస్తా..
నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ఫెయిల్‌‌‌‌ అయ్యింది. ప్రత్యేక తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగుల ఆశలన్ని ఆడియాశలయ్యాయి. కోచింగ్‌‌‌‌ సెంటర్లు, హాస్టళ్లలో లక్షలు ఖర్చు పెట్టి చదువుతున్నా.. నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులను మోసం చేస్తోంది. సీపీఎస్​ రద్దు చేస్తా అని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌‌‌‌ ఇంతవరకూ ఆ పని చేయలేదు. కరోనాతో స్కూళ్లు, కాలేజీలు మూతపడి ప్రైవేట్​టీచర్లు, లెక్చరర్లు ఇబ్బంది పడుతున్నా వారిని ఆదుకోలేదు. తెలంగాణలో ఇప్పటికీ మా పార్టీ బలంగానే ఉంది. కొన్నిసార్లు ఫలితాలు రానంత మాత్రాన పార్టీ క్యాడర్​ లేనట్లు కాదు. నాకు గ్రాడ్యుయేట్లు ఒక అవకాశం ఇస్తే  శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో ముందుంటా.
- ఎల్.రమణ, టీడీపీ

సమస్యల పరిష్కారమే నా అజెండా
టీచర్లు, ఎంప్లాయీస్, పెన్షనర్లు, నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. కానీ, ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగ ఖాళీల భర్తీలో, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లను ఆదుకోవడంలో, ప్రైవేటు మేనేజ్‌‌‌‌మెంట్లు, స్టూడెంట్లు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కరోనా సమయంలో కూడా వారిని ఆదుకోలేదు. సీఎం కేసీఆర్.. టీచర్లు, ఎంప్లాయీస్‌‌‌‌కు పీఆర్సీ, ప్రమోషన్లు ఇస్తానని మాటిచ్చి, అమలు చేయలేదు. విద్యా, వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అందుకే అందరి గొంతుగా వారి సమస్యల పరిష్కారమే అజెండాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న. నన్ను గెలిపిస్తే మండలాల వారీగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్త. ప్రైవేటు సెక్టార్‌‌‌‌లో పనిచేసే వారందరికీ హెల్త్ కార్డులు ఇప్పిస్త.
- గౌరీ సతీశ్‌‌‌‌, ఇండిపెండెంట్‌‌‌‌ క్యాండిడేట్