నా భూమిని నేనెలా కబ్జా చేస్తాను: చల్లా వెంకట్రామిరెడ్డి

అలంపూర్, వెలుగు: నా పేరు మీద ఉన్న భూమిని నేనెలా కబ్జా చేస్తానని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అలంపూర్  హరిత టూరిజం హోటల్​లో మీడియాతో మాట్లాడుతూ భూ కబ్జా చేశారని నాలుగు రోజులుగా తనతో పాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిపై వివిధ మీడియా ఛానళ్లు ఆరోపిస్తున్నాయన్నారు. కోకాపేట సర్వే నెంబర్ 85లోని 2 ఎకరాల-30 గుంటలు 2012లో తాను కొన్నానని, తన పేరు మీద సేల్ డీడ్  ఉందని తెలిపారు. గోల్డ్ ఫిష్  సంస్థతో 2014 లో డెవెలప్​మెంట్  చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నామని, ఆ సంస్థ ఎలాంటి పని చేపట్టలేదన్నారు. గోల్డ్ ఫిష్  సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్  వేగే మీద12 క్రిమినల్ కేసులు, 9 సివిల్ కేసులు ఉన్నాయన్నారు.

Also Read : నిమజ్జనానికి రెడీ అయిన లక్ష గణేష్ విగ్రహాలు

 అతను ఒక బ్లాక్ మెయిలర్​ అని ఆరోపించారు. 2021 ఫిబ్రవరి25న అతడిపై పీడీ యాక్ట్  నమోదైందని చెప్పారు. హీరో ప్రభాస్  బంధువు  సత్యనారాయణ, సంజయ్  కాంతం, తాను కోకాపేటలో 4 ఎకరాల్లో విల్లాస్ కట్టుకోవడానికి డబ్బులు కడితే కూడా పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లామని తెలిపారు. కోకాపేట భూముల వ్యవహారంతో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా కంప్లైంట్ ఇచ్చారని తెలిపారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్  చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. అలంపూర్​ ప్రజలకు  సంజాయిషీ ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశానని చెప్పారు.