కొలువులు వదిలి... ఎమ్మెల్సీ బరిలోకి.. పోలీసులు.. ప్రొఫెసర్లు ..

కొలువులు  వదిలి...  ఎమ్మెల్సీ బరిలోకి.. పోలీసులు.. ప్రొఫెసర్లు ..
  • రాజకీయాల్లోకి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు
  • వీఆర్ఎస్ తీసుకున్న డీఎస్పీ గంగాధర్
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కు ప్రసన్న హరికృష్ణ రిజైన్  
  •  రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి రెడీ
  • ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటనలు

కరీంనగర్, వెలుగు :  ఒకరు డీఎస్పీ కొలువు .. మరొకరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్  వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలో జరగబోయే నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వీరిలో ఒకరు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన డీఎస్పీ మదనం గంగాధర్ కాగా, మరొకరు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం గుండన్నపల్లికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి ప్రసన్న హరికృష్ణ .  వీరిద్దరూ మధ్యలోనే తమ జాబ్ లకు రిజైన్ చేసి పాలిటిక్స్ లోకి వస్తుండడంతో  చర్చనీయాంశంగా మారింది.  

చిత్తు కాగితాలు ఏరుకునే కుటుంబం నుంచి డీఎస్పీగా.. 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ, బెలూన్లు అమ్ముకుంటూ బతికే నిరుపేద కుటుంబంలో పుట్టిన మదనం గంగాధర్ రాత్రి బడిలో చదువుసాగించారు. ఇంటర్, డిగ్రీలోనూ పేపర్ బాయ్ గా పని చేశారు.  ఆ తర్వాత 1997లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో చేరాక ఆయన  జీవితం మలుపు తిరిగింది. 22 ఏండ్ల వయస్సులోనే 1998లో ఎస్ఐ జాబ్  సాధించారు. నల్లగొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ స్టేషన్లలో 26 ఏండ్ల పాటు ఎస్ హెచ్ఓగా విధులు నిర్వహిస్తూ.. కొన్నాళ్ల  కింద డీఎస్పీగా ప్రమోషన్  పొందారు. 

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి కఠిన సేవా, ఉత్తమ సేవా, ముఖ్యమంత్రి సర్వోన్నత పతకాలను అందుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో యాగ్జిలరీ ప్రమోషన్లలో అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రవీణ్ రావు సహా నలుగురు ఆఫీసర్లు అడ్డదారిలో ప్రమోషన్ పొందినట్లు ఈ ఏడాది మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారికి డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేయడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. అంతేగాక భూ వివాదం కేసులో తనను ఐజీ స్టీఫెన్ అక్రమంగా సస్పెండ్ చేసి, ఎలాంటి విచారణ లేకుండా ఏడాదిన్నర కాలం సర్వీస్ కోల్పోయేలా చేశారని గత ఏప్రిల్ లో మరో కంప్లయింట్ చేశారు. ఇక ప్రజలకు అపరిమితమైన సేవలు అందించేందుకే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని గంగాధర్ తెలిపారు. 

అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కు రిజైన్.. 

గ్రూప్ – 1, గ్రూప్ – 2, టెట్, డీఎస్సీ తదితర కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ ఇష్యూస్ పై యూట్యూబ్ వేదికగా పాఠాలు చెప్పే ఫ్యాకల్టీగా పేరున్న ప్రసన్న హరికృష్ణ 2008లో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ గా ఎంపికయ్యారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా ప్రమోషన్ పొందాక ఆదిలాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్, గజ్వేల్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విధులు నిర్వహించారు. 

సుమారు 18 ఏండ్లుగా ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులకు మోటివేషనల్ స్పీచ్ లు ఇచ్చారు. పోటీ పరీక్షల పుస్తక ప్రచురణ సంస్థల్లో ఒకటైన విన్నర్స్ పబ్లికేషన్స్ సలహాదారుడిగా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఆయన అక్టోబర్ 28న తన జాబ్ కు రిజైన్ చేశారు.