బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట

 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో విఠల్ సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన  సుప్రీంకోర్టు స్టే విధించింది.  పిటిషన్‌పై విచారణను జులైకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 

2021లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా విఠల్ నామినేషన్ వేశారు. అలాగే  టికెట్ ఆశించి భంగపడ్డ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. తాను నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోయినా.. తన సంతకాన్ని దండె విఠల్ ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సంతకం ఫోర్జరీ జరిగిందన్న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. దండె విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ 50వేల జరిమానా విధించింది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  అటు పత్తిరెడ్డి  కూడా ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.