-
ఏనుగుల రాకేశ్ పేరిట ఫాతిమానగర్ యూబీఐలో కొత్త ఖాతా
-
పార్టీ అకౌంట్ నుంచే 20 కోట్లు ట్రాన్స్ ఫర్
-
మరో రోజూ ఐదు కోట్లు.. పార్టీ చెక్కు ద్వారా ఇంకో ఐదు కోట్లు
-
ఎంఎల్సీ తాతా మధు అకౌంట్ నుంచి రూ. 50 లక్షలు
-
రాజయ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి 22 లక్షలు
-
వొడితెల, నన్నపనేని ఖాతాల నుంచి ట్రాన్సాక్షన్స్
-
34 సెగ్మెంట్ల ఇన్చార్జిలకు నగదు బదలాయింపు
-
పెట్రోల్ బంకులు, కాంట్రాక్టర్లకు, ఏజన్సీలకూ ట్రాన్స్ ఫర్
-
వైట్ ను బ్లాక్ చేసి ఓటర్లకు పంపిణీ
-
ఈ నెల 29న ఖాతా మొత్తం ఖాళీ
-
కండ్లు మూసుకున్న ఈడీ, ఐటీ!
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్డగోలుగా ఖర్చు చేసింది. ఈ ఎన్నికలను ఇజ్జత్ కా సవాల్ గా తీసుకున్నారు గులాబీ బాస్. ఇందుకోసం పకడ్బందీగా మనీ మ్యాటర్ రన్ అయ్యింది. ఏనుగుల రాకేశ్ (బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి) పేరిట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫాతిమానగర్, వరంగల్ బ్రాంచిలో 009412010001606 ఎస్బీ ప్రీమియం అకౌంట్ ను ఈ నెల 4న ఓపెన్ చేశారు. ఇందులోకి పార్టీ ఖాతా నుంచి నేరుగా 20 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, వొడితెల సతీశ్ కుమార్ ఖాతాల నుంచి రాకేశ్ రెడ్డి కొత్తగా ఓపెన్ చేసిన ఖాతాలో జమయ్యాయి. ఇతర వ్యాపారులు సైతం ఈ ఖాతాకు డబ్బులు బదిలీ చేశారు. నూక యశ్వంత్ అనే వ్యక్తి ఖాతా నుంచి ఐదు కోట్ల రూపాయలు ఈ నెల 15న ట్రాన్స్ ఫర్ అయ్యాయి. మొత్తంగా 31,92,60,952 రూపాయల ట్రాన్సాక్షన్ ఈ ఖాతా నుంచి సాగాయి. ఈ నెల 4న ఓపెన్ అయిన ఈ ఖాతా నుంచి 28వ తేదీ వరకు చురుకుగా లావాదేవీలు కొనసాగాయి. తర్వాత ఈ ఖాతా డీయాక్టివ్ అయ్యింది.
డబ్బుల ఖర్చు ఇలా..
ఏనుగుల రాకేశ్ రెడ్డిని ఎలాగైనా గెలిపించుకోవాలని ప్లాన్ చేసిన బీఆర్ఎస్ భారీ ఎత్తున నగదును ఎగజల్లినట్టు ఈ ట్రాన్సాక్షన్ స్టేట్ మెంట్లను చూస్తే అర్థమవుతుంది. ఈ ఖాతా నుంచి పెట్రోల్ బంకులు, చికెన్ సెంటర్లు, వైన్స్ షాపులకు నగదు బదిలీ జరిగింది. ఈ మేరకు వారు దావత్ లకు కావాల్సిన సరుకులను సమకూర్చారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు స్థానికంగా ఉండే రైసు మిల్లులు, ఏజెన్సీలు, కన్ స్ట్రక్షన్ కంపెనీలనూ బీఆర్ఎస్ లీడర్లు వాడుకొన్నారు. వాటికి నగదు బదిలీ చేయించుకొని స్థానికంగా పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొందరు ఇన్ చార్జిల ఖాతాల్లోకి నేరుగా డబ్బు ట్రాన్స ఫర్ అయ్యాయి. వాటిని వారు తమ కార్యకర్తలు, నాయకుల ద్వారా పంపిణీ చేయించారని సమాచారం. ఏది ఏమైనా అధికారంలో లేకున్నా ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం బీఆర్ఎస్ దాదాపు 32 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం.
అధికారంలో లేకున్నా..
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి దాదాపు ఆరు నెలలవుతోంది. ఈ సమయంలో పలు సంస్థలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ డబ్బును ఎక్కడి నుంచి సమకూర్చారు..? వారికి ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది అంతుచిక్కడం లేదు. ఈ నెల 22న రాజయ్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి( మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు సంబంధించింది) నుంచి ఏకంగా 22 లక్షలు రాకేశ్ రెడ్డి ఖాతాలో జమయ్యాయి. 21వ తేదీన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఖాతా నుంచి 30 లక్షలు క్రెడిట్ అయ్యాయి. ఎమ్మెల్సీ తాతా మధు ఖాతా నుంచి ఈ నెల 20న 57 లక్షల 50 వేల రూపాయలు రాకేశ్ రెడ్డి ఖాతాలో క్రెడిట్ అయ్యాయి. వీరితో పాటు పలువురు వ్యాపారులు, కాంట్రాక్టర్లు కూడా ఈ ఖాతాలో డబ్బులు జమ చేయడం విశేషం.
ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయ్! ( పేజీ1 బాక్స్)
సాధారణంగా 25 లక్షల రూపాయలకు మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే ఆ రోజు అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. కోటి రూపాయల ట్రాన్సాక్షన్ దాటితే ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పే వరకు క్లియరెన్స్ ఇవ్వదు. అలాంటింది కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినా ఈ అకౌంట్ ను ఐటీశాఖ పట్టించుకోక పోవడం మిస్టరీగా మారింది. లక్షలాది రూపాయలు ఖాతాల్లోకి బదిలీ అవుతున్నా.. ఈ డబ్బు ఎక్కడిది..? ఎందుకు ఇస్తున్నారనే విషయమై ఈడీ ప్రశ్నించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
Also read :అప్పుల బాధ తాళలేక.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య
రఘునందన్ వెర్షన్ ఇది
దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ పై ఈసీకి కంప్లయింట్ చేశారు. బీఆర్ఎస్ ఖాతా నుంచి రూ. 30 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయని, పార్టీ అధికారిక ఖాతా నుంచి ఎందుకు బదిలీ చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యాక్షన్ తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి అకౌంట్లు సీజ్ చేసి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. డబ్బులు పంచి ఈ ఎన్నికలో గెలవాలని ప్రయత్నించిన ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.