- సోషల్ మీడియా లోనూ విస్తృత ప్రచారం
- టీచర్ సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మొదలైంది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఫిబ్రవరి 27న ఎలక్షన్లు జరగనున్నాయి. పోలింగ్ కు నెల రోజుల టైమ్ కూడా లేకపోవడంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలుస్తూనే, సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రాడ్యుయేట్లు, టీచర్ల సంఘాల మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనున్నది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 3న మూడు స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్నది. సమయం నెల రోజులు కూడా లేకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది, ప్రచారాన్ని స్పీడప్ చేశారు.
పోటీకి చాలామంది రెడీ..
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకంగా మారాయి. తక్కువ మంది ఓటర్లు ఉండటంతో ఎక్కువ మంది పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ‘కరీంనగర్’ టీచర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ, తపస్ అభ్యర్థిగా మల్క కొమురయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, టీపీటీఎఫ్– యూటీఎఫ్ ఉమ్మడి అభ్యర్థిగా అశోక్ కుమార్, సీపీఎస్ఈయూ అభ్యర్థిగా ఇన్నారెడ్డితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, బీజేపీ నుంచి టికెట్ ఆశించిన సుధాకర్ రెడ్డి కూడా పోటీకి రెడీ అయ్యారు.
ఇదే జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి పేరు ఇప్పటికే ఖరారు కాగా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇంకా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. ‘వరంగల్’ టీచర్ సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్– టీపీటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థిగా శ్రీపాల్ రెడ్డి, జాక్టో తరఫున మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి, తపస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి, సీపీఎస్ఈయూ అభ్యర్థి వెంకటస్వామి తదితరులు పోటీకి సిద్ధమయ్యారు. మూడు సెగ్మెంట్లలో ఇండిపెండెంట్ గా చాలా మంది పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు.
క్యాంపెయిన్ కష్టాలు..
ఎన్నికల రూల్స్ప్రకారం స్కూళ్లు, విద్యాసంస్థల్లో ప్రచారం చేయొద్దు. దీంతో అభ్యర్థులంతా టీచర్ల ఇండ్లకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. మద్దతిచ్చే సంఘాలతో సమావేశాలు, గెట్ టూ గెదర్ లు పెడుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే సోషల్ మీడియానూ నమ్ముకున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్, ఎక్స్ తదితర వాటి ద్వారా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రధాన సంఘాలు పది వరకు ఉన్నా.. మొత్తంగా సుమారు 60 వరకూ సంఘాలున్నాయి. ఈ క్రమంలో ప్రతి సంఘం కూడా అభ్యర్థులకు కీలకంగా మారింది. దీంతో వారి మద్దతు కూడ గట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.