
- ఎన్నికల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వారివే
- బీసీ వాదంతో యూనియన్లలో చీలిక
- ఓటర్లను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు
- ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు సిద్ధం
నల్గొండ, వెలుగు : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల గడువు ఒక్క రోజే మిగిలి ఉంది. ఈనెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని బరిలో నిలపగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తటస్థంగా ఉన్నాయి. దీంతో రాజకీయ పార్టీల ప్రమేయం కంటే, ఉపాధ్యాయ సంఘాల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. సిటింగ్‌ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి యూటీఎఫ్ నుంచి బరిలో ఉండగా, పీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, పీఆర్‌టీయూ-టీఎస్ నుంచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి పులి సర్వోత్తమ్‌రెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సహా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు పోటాపోటీగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. 12 జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో 25,797 మంది ఓటర్లుగా ఉన్నారు.
సంఘాలపైన బీసీ వాదం ఎఫెక్ట్..
ఈ ఎన్నికల్లో బీసీవాదం సంఘాల ఉనికిని ఛాలెంజ్ చేస్తున్నాయి. టీచర్ల సంఘాలు బలపడాలంటే ఆ వర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలి. లేదంటే బీసీ సెంటిమెంట్ ప్రభావం చూపిస్తే అప్పుడు సంఘాల ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీయూఎస్ మధ్యే పోటీ ఉంటుంది. కానీ కొత్తగా బీసీ వాదాన్ని విస్తృతంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వం కూడా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రచారం చేస్తుండడంతో ఆ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై పడుతుందని బీసీ అభ్యర్థులు చెబుతున్నారు.
ఓటర్లలో చీలిక..
ఇప్పటికే ఓటర్లు వివిధ వర్గాలుగా చీలిపోయారు. ఒక యూనియన్‌లో ఉంటూ మరో యూనియన్‌కు అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నారు. బీసీవాదం తెరపైకి రావడంతో ఓసీ అభ్యర్థులు జాగ్రత్త పడుతున్నారు. సంఘాల నుంచి ఎన్నికైన అభ్యర్థులు మాత్రమే టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని, అదే బీసీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఎమ్మెల్యేల మద్ధతు కోసం ప్రయత్నాలు..
ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎమ్మెల్యేల మద్ధతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేలను కలిసి తమకు సపోర్ట్ చేయాలని, నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు నచ్చచెప్పాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో బీసీవాదం గెలిస్తే లోకల్ బాడీ ఎన్నికలపై కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని, సంఘాల అభ్యర్థులు పైచేయి సాధిస్తే యూనియన్లు మరింత బలోపేతం అవుతాయని లీడర్లు చెబుతున్నారు.
ఓటుకు రూ.5 వేలు..?
19 మంది అభ్యర్థులు పోటీల్లో ఉండడంతో ఓటర్లు చీలిపోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే డబ్బు ఆశ చూపిస్తున్నారు. అవసరమైతే ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు కూడా వెనకాడేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ దావత్‌లతో ఎక్కడికక్కడా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి ఓటర్ల కదలికలపై నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఓటర్లు జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు.