
వరంగల్ -ఖమ్మం -నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. కౌంటింగ్ కోసం 25 టేబుళ్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పేపర్లన్నింటినీ 25 చొప్పున కట్టలు కట్టిన తర్వాతే తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్‌కు 40 కట్టల చొప్పున మొత్తం వెయ్యి ఓట్లను ఒక రౌండ్‌లో కౌంటింగ్ చేస్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓట్ల లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. అదే విధంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌంటింగ్ కేంద్రం వద్ద సెక్యూరిటీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు.
ఓట్ల లెక్కింపులో భాగంగా అభ్యర్థులు, ఏజెంట్లు , అధికారులు సోమవారం (మార్చి3) ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి చేరుకున్నారు. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంమయ్యింది. లెక్కింపు ప్రక్రియ కోసం నల్లగొండలోని అర్జాలబావి గోదాముల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 24,139 ( 93.57%) ఉండగా 19 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. చెల్లని ఓట్లను తీసేసి, చెల్లిన ఓట్ల నుంచి 50 శాతం ప్లస్ ఒకటి కలిపి గెలుపు కోటాను ఖరారు చేస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ రౌండ్‌ను ప్రారంభిస్తూ రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొత్తం కౌంటింగ్ సాయంత్రం 4 గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రధాన పోటీదారులు:
టీచర్స్ జాక్ నుంచి పూల రవీందర్, యూటీఎఫ్ బలపర్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్‌టీయూటీఎస్ నుంచి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి పులి సరోత్తంరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి ,హర్షవర్ధన్‌రెడ్డి, కుడా మాజీ చైర్మన్ సుందర్‌రాజు యాదవ్ ఫోటీ పడుతున్నారు.