ఎమ్మెల్సీ హడావుడి షురూ 

ఎమ్మెల్సీ హడావుడి షురూ 

మార్చిలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు
టీచర్ల స్థానానికి తీవ్రంగా కాంపిటీషన్
పోటాపోటీగా ఎల్​రోల్​మెంట్ 
ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పలు సంఘాలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు హడావుడి మొదలైంది. ఓటర్  ఎన్​రోల్​మెంట్ తో పాటు ప్రచార పర్వం ప్రారంభమైంది. రెండు టీచర్  స్థానాలు, ఒక గ్రాడ్యుయేట్  స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ఎన్నికల అధికారులు ప్రారంభించారు. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్  జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అదే సెగ్మెంట్  నుంచి టీచర్  ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల టీచర్  సెగ్మెంట్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియనుంది.

దీనికి సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ముగిసింది. అయితే, ఈ మూడు స్థానాలకు జరిగే ఎన్నికల్లో టీచర్లు కీలకంగా మారనున్నారు. దీంతో రెండు టీచర్  స్థానాలకు పోటీ చేసేందుకు టీచర్ల సంఘాలు కసరత్తు మొదలుపెట్టాయి. మరోపక్క కొన్ని సంఘాలు కరీంనగర్  గ్రాడ్యుయేట్ స్థానానికి కూడా పోటీ చేయాలని భావిస్తున్నాయి. బీజేపీతో పాటు పలు పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను నిలపాలని భావిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలతో పాటు టీచర్ల సంఘాలు పోటీపడి ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టి మరీ నమోదు చేయిస్తున్నాయి. 

పోటీకి సంఘాల సై..

కరీంనగర్, వరంగల్  టీచర్  స్థానాలకు పోటీ చేసేందుకు టీచర్ల సంఘాలు ఉత్సాహం చూపుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద సంఘాలుగా ఉన్న రెండు టీచర్  యూనియన్లు ఆయా స్థానాలకు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. వరంగల్  టీచర్  సెగ్మెంట్ కు సిట్టింగ్  ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని మరోసారి బరిలోకి దింపుతామని టీఎస్ యూటీఎఫ్  రాష్ట్ర కమిటీ తెలిపింది. గతంలో చేజారిన ఈ స్థానంలో మళ్లీ పాగావేయాలని భావిస్తున్న పీఆర్టీయూటీఎస్  తన అభ్యర్థిగా ఆ సంఘం స్టేట్  ప్రెసిడెంట్  పింగిలి శ్రీపాల్ రెడ్డి పేరును ప్రకటించింది.

మరోపక్క కరీంనగర్​ టీచర్  ఎమ్మెల్సీ స్థానానికి పీఆర్టీయూ అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి పేరును ప్రకటించారు. మిగిలిన సంఘాలు వారం, పది రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ రెండు స్థానాలకు బీజేపీ అధికారికంగా అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ద్వారా ఆశావాహుల పేర్లను తీసుకుంది. కరీంనగర్​ స్థానం నుంచి హైదరాబాద్​లోని కార్పొరేట్  స్కూల్  మేనేజ్ మెంట్  ప్రతినిధి కొమురయ్యతో పాటు గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన మామిడి సుధాకర్  పేరును బీజేపీ పరిశీలిస్తోంది. ముందుగా కొమురయ్య పేరు దాదాపు ఖరారైందనే ప్రచారం జరిగినా.. మళ్లీ తపస్, సర్కారు టీచర్ల నుంచి వ్యతిరేకత రావడంతో బీజేపీ పునరాలోచనలో పడ్డట్టు నేతలు చెబుతున్నారు. కరీంనగర్  టీచర్  స్థానంపై స్పష్టత వచ్చాకే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. టీచర్  సెగ్మెంట్లకు కాంగ్రెస్  అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. బీఆర్ఎస్  కూడా అదే దారిలో ఉన్నట్టు తెలుస్తోంది. 

 కరీంనగర్​లో మద్దతుకు ప్రయత్నాలు..

కరీంనగర్  సెగ్మెంట్ లో జరిగే గ్రాడ్యుయేట్  ఎన్నికల్లోనూ టీచర్లు కీలకంగా మారనున్నారు. దీంతో టీచర్ల మద్దతు కోసం అన్ని పార్టీలు, అభ్యర్థులు ప్రయత్నాలు మొదపెట్టారు. స్కూల్  ఎడ్యుకేషన్ లో కీలకమైన పెద్ద సంఘాల సపోర్టు కోసం క్యూ కడుతున్నారు. అయితే, కాంగ్రెస్  తరపున పోటీ చేసేందుకు సిట్టింగ్  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు నరేందర్ రెడ్డి, రాజేందర్ రావు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ తరపున ఆ సీటు కోసం మెదక్  జిల్లాకు చెందిన అంజిరెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లాకు చెందిన రఘునాథరావు, ఉమ్మడి నిజామాబాద్  జిల్లాకు చెందిన రంజిత్  మోహన్ ప్రయత్నాలు చేస్తున్నారు.