
భారత రాజ్యాంగాన్ని రూపొందించే కాలం నాటికి కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలిలు ఉన్నాయి. కొంత మంది అన్ని రాష్ట్రాల్లో శాసన మండలిలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా హెచ్.వి.కామత్తదితరులు ఉన్న వాటిని కూడా రద్దు చేయాలని కోరారు. ఈ విషయంలో మన రాజ్యాంగ నిర్మాతలు మధ్యే మార్గా న్ని అనుసరించారు.
రాష్ట్రాల్లో శాసన మండలి ఏర్పాటు విషయాన్ని రాష్ట్రాల అభిష్టానికి వదిలి పెట్టారు. అంటే ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానాన్ని అనుసరించి మాత్రమే పార్లమెంట్ తీర్మా నం చేసి శాసన మండలిని ఏర్పాటు చేస్తుంది. అలాగే, రద్దు కూడా చేస్తుంది. ప్రస్తుతం దేశంలో ఆరు రాష్ట్రాల్లో శాసన మండళ్లు ఉన్నాయి. అవి.. ఉత్తరప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్, తెలంగాణ.
ఆర్టికల్ 169 ప్రకారం ఒక రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా శాసనసభ 2/3వ వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదించి పంపిన తర్వాత పార్లమెంట్ సాధారణ మెజార్టీతో రాష్ట్ర అభిప్రాయానికి ఆమోదం తెలుపుతుంది.
మండలి నిర్మాణం
- ఆర్టికల్ 171 ప్రకారం శాసన మండలిల నిర్మాణం గురించి తెలుపుతుంది.
- శాసన మండలి సభ్యులు ఐదు పద్ధతుల ద్వారా పదవిలోకి వస్తారు.
- శాసన మండలి బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే సభగా పేర్కొంటారు.
- శాసన మండలి సభ్యుల సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది.
- 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య కనిష్టంగా 40, గరిష్టంగా రాష్ట్ర విధాన సభ సభ్యుల సంఖ్యలో 1/3వ వంతుకు మించరాదు.
- వివిధ రాష్ట్రాల శాసన మండలి సభ్యుల సంఖ్య. ఉత్తరప్రదేశ్ 100, ఆంధ్రప్రదేశ్58, మహారాష్ట్ర 78, బిహార్75, కర్ణాటక 75, తెలంగాణ 40.
పదవీకాలం
- శాసన మండలి సభ్యుల పదవీ కాలం ఆరు సంవత్సరాలు. సభను మధ్యలోనే రద్దు చేయడానికి అవకాశం లేదు. శాసన మండలి కాల పరిమితిపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు.
- శాసన మండలిని తాత్కాలికంగా రద్దు చేయడానికి అవకాశం లేదు. కానీ, శాశ్వతంగా రద్దు చేయవచ్చు.
- శాసన మండలి మొత్తం స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించరు. సభ్యులు కూడా మొత్తం ఒకేసారి పదవీ విరమణ చేయరు.
- ప్రతి రెండు సంవత్సరాలకు మండలిలోని 1/3వ వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేయగా అంతే సంఖ్యలో ఎన్నికలు నిర్వహిస్తారు.
- శాసన మండలిని నిరంతర సభగానూ శాశ్వత సభగానూ పేర్కొనవచ్చు.
ఆర్టికల్ 174 ప్రకారం శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత గవర్నర్ శాసన సభను ప్రోరోగ్ అంటే దీర్ఘకాలిక వాయిదా చేసిన అనంతరం శాసనసభ తిరిగి సమావేశం కావడానికి మధ్య వ్యవధి ఆరు నెలలు మించరాదు. అదే అంశం కేవలం పదవిలో ఉన్న శాసనసభకు మాత్రమే వర్తిస్తుంది. రద్దయిన శాసనసభకు వర్తించదు అని సుప్రీంకోర్టు 2002లో స్పష్టం చేసింది.
సమావేశాల నిర్వహణ
రాజ్యాంగంలోని ఆర్టికల్ 182 ప్రకారం శాసన మండలి సమావేశాలకు అధ్యక్షత వహించి నిర్వహించడం కోసం శాసన మండలి సభ్యులు తమలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. చైర్మన్ సమావేశాలకు హాజరుకాని సందర్భంలో అధ్యక్షత వహించడం కోసం సభ్యులు తమలో మరొకరిని డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.
రాజీనామాలు, తొలగింపులు
ఆర్టికల్ 183 ప్రకారం శాసన మండలి చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ చైర్మన్ కు ఇవ్వాలి. అలాగే, డిప్యూటీ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని చైర్మన్ కు ఇవ్వాలి. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లు ఏ కారణంతోనైనా తమ శాసన మండలి సభ్యత్వాన్ని కోల్పోయినట్లయితే వారు తమ పదవులను కూడా కోల్పోతారు. శాసన మండలి ఒక సాధారణ తీర్మానం ద్వారా చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లను పదవి నుంచి తొలగించవచ్చు.
ఎన్నిక పద్ధతి
మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మందిని రాష్ట్ర శాసనసభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నుకుంటారు.
మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మందిని స్థానిక పరిపాలనా సంస్థల ప్రతినిధులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కులేదు. ఈ విషయంలో చట్ట సవరణ చేసే అధికారం పార్లమెంట్‌కు ఉన్నది.
మొత్తం సభ్యుల్లో 1/6వ వంతు మందిని గవర్నర్ నియమిస్తారు. కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, సహకార రంగాల్లో ప్రఖ్యాతిగాంచిన వారిని శాసన మండలిలో నియమిస్తారు.
మొత్తం సభ్యుల్లో 1/12 మందిని రాష్ట్రంలోని ఉపాధ్యాయులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. హైస్కూల్ నుంచి పై స్థాయిలోని విద్యా సంస్థల్లో అంటే ఉన్నత విద్యాసంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది.
1/12వ వంతు మందిని రాష్ట్రంలోని పట్టభద్రులు ఎన్నుకుంటారు. డిగ్రీ పూర్తి చేసిన మూడేండ్ల తర్వాత మాత్రమే ఓటు హక్కు కల్పిస్తారు. పైన పేర్కొన్న పద్ధతుల్లో సవరణలు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు.
ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసేవారు ఉపాధ్యాయులు కావాల్సిన అవసరం లేదు. అలాగే పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీచేసే వ్యక్తి పట్టభద్రుడు కావాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు నారాయణస్వామి వర్సెస్ పన్నీర్ సెల్వం మధ్య జరిగిన వ్యాజ్యంలో 1972లో తీర్పు ఇచ్చింది. అర్హతలు అనేవి ఓటర్లకు మాత్రమే వర్తిస్తాయి. పోటీ చేసే అభ్యర్థులకు కాదు.