ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు షురూ.. గ్రాడ్యుయేట్‌‌ స్థానానికి ఎనిమిది.. టీచర్లకు ఆరు

 ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు షురూ..  గ్రాడ్యుయేట్‌‌ స్థానానికి ఎనిమిది.. టీచర్లకు ఆరు

కరీంనగర్‌‌టౌన్‌‌/ నల్గొండ , వెలుగు: గ్రాడ్యుయేట్‌‌, టీచర్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్‌‌ గ్రాడ్యుయేట్‌‌, టీచర్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌‌ను సోమవారం కలెక్టర్‌‌ పమేలా సత్పతి విడుదల చేశారు. కరీంనగర్‌‌ గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు ఎనిమిది సెట్లు, టీచర్స్‌‌ స్థానానికి ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు వేశారు.

 గ్రాడ్యుయేట్‌‌ స్థానానికి కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్, హైదరాబాద్‌‌లోని కూకట్‌‌పల్లికి చెందిన చలిక చంద్రశేఖర్‌‌ రెండు సెట్ల చొప్పున దాఖలు చేయగా, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన దూడ మహిపాల్‌‌, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడెంకు చెందిన గవ్వల లక్ష్మి, మేడ్చల్‌‌ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన కంటె సాయన్న, ఆదిలాబాద్‌‌ జిల్లాకు చెందిన మంచికట్ల ఆశమ్మ ఒక్కో సెట్‌‌ వేశారు.

 అదేవిధంగా టీచర్స్‌‌ ఎమ్మెల్సీ స్థానానికి సిలివేరు శ్రీకాంత్, చలిక చంద్రశేఖర్‌‌ రెండు సెట్ల చొప్పున నామినేషన్లు వేయగా, మాజీ ఎమ్మెల్సీ, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన కూర రఘోత్తంరెడ్డి ఒక సెట్‌‌ నామినేషన్‌‌ వేశారు. నామినేషన్లు దాఖలు చేసే క్యాండిడేట్ల సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఆఫీసర్లు హెల్ప్‌‌ డెస్క్‌‌ ఏర్పాటు చేశారు.


నల్గొండ టీచర్స్‌‌ స్థానానికి ఒక్క నామినేషన్‌‌

నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌ టీచర్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌‌ను రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌ ఇలా త్రిపాఠి సోమవారం విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం నల్గొండ కలెక్టరేట్‌‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకోనున్నట్లు కలెక్టర్‌‌ చెప్పారు. 8, 9 తేదీల్లో ప్రభుత్వ సెలవులు ఉన్నందున ఆ రోజు నామినేషన్లు తీసుకోబోమని తెలిపారు. మొదటి రోజు ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్‌‌ దాఖలు చేశారు.