ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనక్కి తగ్గిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వెనక్కి తగ్గిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ !
  • ఓటమి భయమా వ్యూహాత్మక మౌనమా?
  • ఎవరికి మద్దతు ఇవ్వాలన్న విషయంలో డైలామాలో పడ్డ లీడర్లు
  • ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్న మాజీ మేయర్‌‌‌‌ రవీందర్ సింగ్‌‌‌‌

కరీంనగర్, వెలుగు : కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్‌‌‌‌ గ్రాడ్యుయేట్, టీచర్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నిర్ణయించిందని ప్రచారం జరుగుతుండడంతో ఆ పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తరఫున క్యాండిడేట్‌‌‌‌ను బరిలోకి దింపడం కేసీఆర్‌‌‌‌కు ఇష్టం లేదని, ఇతర క్యాండిడేట్లకు కూడా మద్దతు ఇచ్చే ఆలోచన లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతుండడంతో ఇన్నాళ్లూ ఆశతో ఉన్న ఆ పార్టీ లీడర్లు నిరాశకు గురవుతున్నారు. 

ఒకప్పుడు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్‌‌‌‌ ఉమ్మడి జిల్లాల నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పోటీకి వెనుకడుగు వేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా పార్టీ అధినేత కేసీఆర్, ఇతర నేతలు కేటీఆర్, హరీశ్‌‌‌‌రావు, కవిత, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌‌‌‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదన్న ప్రశ్న పార్టీ శ్రేణులను వేధిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ఓడిపోతామన్న భయమా ? లేదంటే వ్యూహాత్మకంగానే ఎన్నికలకు దూరంగా ఉంటున్నారా ? అని చర్చ సాగుతోంది.

లీడర్ల ఆశలపై నీళ్లు

2019లో జరిగిన కరీంనగర్‌‌‌‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌ పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో గ్రూప్‌‌‌‌ 1 ఆఫీసర్స్ అసోసియేషన్‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల చంద్రశేఖర్‌‌‌‌గౌడ్‌‌‌‌ పోటీలో నిలబడగా ఆయనకు మద్దతు ఇచ్చింది. కానీ అప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్‌‌‌‌ జీవన్‌‌‌‌రెడ్డి గెలిచారు. 

ఈ సారైనా నేరుగా పార్టీ క్యాండిడేట్‌‌‌‌నే బరిలో దింపుతారన్న ఆశతో కరీంనగర్‌‌‌‌ మాజీ మేయర్, తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌ సర్దార్‌‌‌‌ రవీందర్‌‌‌‌సింగ్‌‌‌‌, ఓయూ జేఏసీ మాజీ నేత, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత రాజారాం యాదవ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌‌‌‌రావు, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు బీఎన్‌‌‌‌రావు పోటీకి సిద్ధం కావడంతో పాటు గ్రాడ్యుయేట్లను కలుస్తూ ప్రచారం కూడా ప్రారంభించారు. 

కానీ పోటీ చేసే ఆలోచనలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లేదని, క్యాంపెయిన్‌‌‌‌ చేసుకోకపోవడం మంచిదని పార్టీ నేతలు చెప్పడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌‌‌‌రావు ఇండిపెండెంట్‌‌‌‌గా ప్రచారం చేసుకుంటుండగా, మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీలో ఉండేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అగ్రనేతలు వద్దని వారించినా వీరిద్దరు మాత్రం పోటీకే సై అంటున్నట్లు తెలిసింది. 

బీఆర్ఎస్‌‌‌‌పై గ్రాడ్యుయేట్లు, టీచర్లకు తగ్గని ఆగ్రహం

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అధికారం కోల్పోయి ఏడాది దాటినా.. గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఆ పార్టీపై ఆగ్రహం చల్లారకపోవడమే పోటీకి దూరంగా ఉండడానికి కారణంగా తెలుస్తోంది. ఈ సెక్షన్ల నుంచి వచ్చిన ఫీడ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ మేరకే బరిలో నిలవొద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పదేండ్ల బీఆర్ఎస్‌‌‌‌ పాలనలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై నిర్లక్ష్యం వహించడం, గ్రూప్‌‌‌‌ 1, ఇతర ఉద్యోగ నియామక పరీక్షా పత్రాల లీకేజీ, టీఎస్‌‌‌‌పీఎస్సీలో అక్రమాలు, ఏండ్ల తరబడి పోస్టులు భర్తీ చేయకపోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 

అలాగే 317 జీవో కింద టీచర్లను ఇష్టారాజ్యంగా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేయడం, పదేండ్లలో ఒక్కసారి కూడా ప్రమోషన్లు ఇవ్వకపోవడం, జీతాలు ఆలస్యంగా ఇచ్చిన సంఘటనలను ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయకపోవడమే మంచిదని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలిసింది. అంతేగాక ఈ ఒక్క ఎన్నికలో ఓడిపోతే.. ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన కూడా ఆ పార్టీ నేతల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.