
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను మరోసారి వేడెక్కించాయి. వరుసగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికలు.. 15 నెలల కాలంగా తెలంగాణ రాజకీయాలకు విరామం కరువైందనే చెప్పాలి. ఒక్క బీజేపీ మాత్రమే 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం. కాంగ్రెస్ ఒక స్థానానికి మాత్రమే పోటీ చేయడం. ఇక బీఆర్ఎస్అయితే పోటీయే చేయకపోవడం, బీసీ వాదంతో పోటీ చేసినవారు కూడా ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తించాయి. ఫలితాలు మాత్రం 2 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో పీఆర్టీయూ గెలిచాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం షరామామూలే అయినా.. సీరియస్‌గా పోటీ చేసిన అభ్యర్థులంతా డబ్బు ఖర్చుచేసినవారే. గెలిచిన అభ్యర్థులు మాత్రమే ఖర్చు చేశారని నిందించే అవకాశం లేదు. టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఇచ్చిన తీర్పు ఇది. ఈ ఫలితాలు రాష్ట్ర ప్రజల నాడికి సంపూర్ణ కొలమానం కాకపోవచ్చు. కానీ చదువరుల తీర్పులోనూ కొంతమేర ప్రజల నాడి ఉంటుంది. ఎమ్మెల్సీ ఫలితాలు నిజంగానే రాష్ట్ర రాజకీయ సమీకరణలను మార్చనున్నాయా..? రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలిచిన బీజేపీ మరింత బలపడనుందనేది నిజమేనా..? నిజంగానే బీజేపీ బలపడితే అది ఏ పార్టీకి నష్టం..? ఈ ప్రశ్న కాంగ్రెస్‌కన్నా బీఆర్ఎస్నే ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తుందని చెప్పొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజకీయ చర్చ ఇదే.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ 37శాతం ఓట్లను సాధించింది. కానీ లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి బీఆర్ఎస్ కేవలం16శాతం ఓట్లకే పరిమితమైంది. కాంగ్రెస్, బీజేపీ సమ ఉజ్జీలుగా లోక్‌సభ సీట్లను గెలుచుకున్నాయి. బీఆర్ఎస్కనీసం ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలుచుకోకపోవడం అటుంచితే,15 లోక్‌సభ స్థానాల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది.
ఒకరకంగా ప్రజలు బీఆర్ఎస్అస్తిత్వాన్నే గుర్తించని పరిస్థితి అది. ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయకుండా తప్పించుకోవడం వెనకాల ఉన్న కారణం తెలియంది కాదు. వరుస ఓటములను మూటగట్టుకుంటే ఆ పార్టీ తన ఉనికిని తానే తుడిచేసుకోవడం అవుతుందనే భయంతోనే పోటీ చేయలేదనేది బహిరంగ రహస్యం. పదేండ్ల పాలనా దోషాలు ఆ పార్టీని వెంటాడుతుండటమే దాని భయాందోళనకు కారణం.
కాంగ్రెస్‌ను సీరియస్‌నెస్ కొరత వెంటాడుతోంది
కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్‌స్థానానికి మాత్రమే పోటీ చేసింది. గతంలో అది ఆ పార్టీ స్థానమే కాబట్టి పోటీ చేయక తప్పలేదని కూడా చెప్పొచ్చు. టీచర్స్స్థానాలకు పోటీచేసే సంప్రదాయం కాంగ్రెస్‌కు లేని మాట కూడా నిజమే. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్స్థానం అభ్యర్థి మాత్రం ఎవరూ ఊహించనంతగా ఓట్లు సాధించాడు. నువ్వా నేనా అనే రీతిలో ఆయన బీజేపీ అభ్యర్థికి పోటీ ఇచ్చి కాంగ్రెస్పరువు నిలబెట్టాడనే చెప్పాలి. స్వల్ప తేడాతో ఆయన ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీకి ఉపశమనం కావచ్చు.
కానీ అభ్యర్థికి లభించిన ఓట్లలో కాంగ్రెస్కష్టం ఎంత..? అభ్యర్థి కష్టం ఎంత..? అనే చర్చ ఉంది. ఏ ఎన్నికైనా అధికార పార్టీకి ఎప్పుడూ అడ్వాంటేజ్‌గా ఉంటుంది. పదేండ్ల కేసీఆర్హయాంలో జరిగిన ఉప ఎన్నికలు, ఇతరత్రా ఎన్నికలు ఎలా జరిగేవో తెలియని విషయం కాదు! కానీ కేసీఆర్హయాంలో లాగ అడ్డదారిలో అధికార దుర్వినియోగం చేయనందుకు కాంగ్రెస్‌పార్టీని అభినందించాల్సిందే! కానీ.. అధికార పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న గ్రాడ్యుయేట్ స్థానంలో అధికార పార్టీ ఓటమిపాలు కావడం కాంగ్రెస్‌పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిందనే చెప్పాలి.
కాంగ్రెస్‌పార్టీలో సహజంగా ఉండే ‘ఎవరికి వారే’ అనే నైజమే ఆ పార్టీ ఓటమికి కారణమా..? లేదా అభ్యర్థి కారణమా..? తెలియదు. కానీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌పార్టీ అక్కడ పనిచేయలేదనే వాదన ఉంది. ఒకవేళ అదే నిజమైతే.. 93 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్అభ్యర్థిని మాత్రం ఎవరైనా అభినందించాల్సిందే! అభ్యర్థుల మీద మాత్రమే ఆధారపడి ఏపార్టీ గెలవలేదు. అభ్యర్థితోపాటు పార్టీ కూడా బాగా పనిచేస్తేనే గెలుపునకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌కు గ్రాడ్యుయేట్ఎన్నికలో ఎదురైన ఓటమిని ఆ దృష్టితోనే చూడాలి.
ఉత్తర తెలంగాణ నుంచి మొదలైన ప్రస్థానం..
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పోటీ చేసింది. అలాగే, తన లక్ష్యానికి అనుగుణమైన విజయాలనూ సాధించుకోగలిగింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ 5వ స్థానానికి పరిమితం కావడం చూస్తే.. దక్షిణ తెలంగాణలో ఆ పార్టీ ఇంకా పుంజుకోలేకపోతున్నదని అర్థమవుతోంది. ఉత్తర తెలంగాణలో 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి బీజేపీ ప్రతి ఎన్నికల్లోనూ వేళ్లూనుకుంటూ వస్తున్నది.
తెలంగాణలో బీజేపీ విస్తరణ ఉత్తర తెలంగాణ నుంచి మొదలైందని చెప్పొచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు, 8 లోక్‌సభ సీట్లు సాధించిన బీజేపీ తెలంగాణపై బాగా ఆశలు పెంచుకుంది. నిజానికి ఇల్లు అలుకగానే పండుగ కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపులు మాత్రమే సరిపోయేవి కావు. తెలంగాణలో బీజేపీ మరో మూడున్నర ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సిఉంది.
నిరంతరం ఇటు బీఆర్ఎస్ను, అటు కాంగ్రెస్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి సెమీ ఫైనల్ ఎన్నికల లాంటివనే చెప్పాలి. స్థానిక సంస్థల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తేనే.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి పార్టీగా నిలబడే అవకాశాలు పెరుగుతాయి. బీజేపీ విస్తరణ ఎవరికి ఎసరు పెడుతుందనే ఆందోళన మాత్రం కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్నే ఎక్కువగా వేధిస్తున్నదనడంలో సందేహం లేదు.
బీసీవాదం అన్ని పార్టీలకూ అనివార్యమైనట్లే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక కొత్త (బీసీ) రాజకీయానికి ప్రాణం పోస్తుందా అనే చర్చ కూడా జోరుగా సాగింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ స్థానంలో బీసీ వాదం పేర పోటీ చేసిన అభ్యర్థి 4వ స్థానంలో నిలిచి ఆశించిన ఓట్లను సాధించలేకపోయారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్గ్రాడ్యుయేట్స్థానంలో 3వ స్థానంలో నిలిచిన రాజకీయ బీసీ వాదం ఓటమిచెందినా 60 వేల ఓట్లను మాత్రం సాధించగలిగింది.
కరీంనగర్ గ్రాడ్యుయేట్స్థానంలో బీసీ వాదం కొంతమేరకైనా బీసీ పోలరైజేషన్చేయగలిగిందని చెప్పొచ్చు. బీసీ సామాజిక సమీకరణ అనేది అంత సులభం కాదేమో! 103 కులాల సామాజిక పరిస్థితులు ఒకేలాంటివి కావు. బీసీ వాదానికి అదొక అవరోధమేనా.. అనేది ఎమ్మెల్సీ ఫలితాలతో మాత్రమే తేలేది కాదు. కాకపోతే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెచ్చిన బీసీవాదం..రాబోయే కాలంలో అన్నిపార్టీలకు ఒక అనివార్యతను మాత్రం సృష్టించిందని చెప్పాలి.
బీజేపీ బీసీ నాదం!
తెలంగాణలో (2023 అసెంబ్లీ ఎన్నికల్లో) బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పిన మొట్టమొదటి పార్టీ మాత్రం బీజేపీనే. అసెంబ్లీ ఎన్నికల్లో అంతగా లబ్ధి పొందలేకపోయినా.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఆ ప్రయోజనాన్ని చాలామేరకు పొందగలిగింది. బీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి స్వయాన కేసీఆర్లేదా ఆయన కుటుంబ సభ్యులు తప్ప మరొకరు కాలేరనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే, కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పీరియెడ్ తర్వాత ఎవరవుతారనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. మిగిలిందల్లా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం అని ఇదివరకే హామీ ఇచ్చిన బీజేపీకి కాలం కలిసొచ్చేనా? ఎమ్మెల్సీ ఫలితాలు చూపిన దారెటు అంటే.. మరో మూడున్నరేండ్లపాటు వేచి చూడాల్సిందే.
బీఆర్ఎస్కు నైతికత సమస్య
కాంగ్రెస్ప్రభుత్వంలోని ఏ తప్పిదాన్ని ఎత్తి చూపినా.. అది బీఆర్ఎస్ నైతికతవైపు నాలుగువేళ్లు ఎత్తి చూపిస్తున్నాయి. పదేండ్లు పాలించిన పార్టీ, ఇప్పుడు ప్రశ్నించే నైతికత కోల్పోయి ప్రతిపక్షంగా కూడా రాణించలేకపోతున్నది. అందుకే కేసీఆర్ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి ఇష్టపడుతున్న దాఖలా లేదు. 15 నెలల నుంచి అసెంబ్లీకి రాకపోవడం వెనకాల ఉన్న కారణమూ అదే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఏమేరకు నిలబడి పోరాడగలదనే చర్చ మాత్రం నడుస్తోంది. ఎందుకంటే, ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ బలపడుతుండడమే అందుకు కారణమని విశ్లేషకుల అభిప్రాయం.
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్