
- నరేందర్ రెడ్డి తరఫున హాజరుకానున్న మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు
- ఎమ్మెల్సీ ఎన్నికలకు మిగిలింది 11 రోజులే
- జిల్లాలను చుట్టేస్తున్న అభ్యర్థులు.. రంగంలోకి పార్టీలు
ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా ప్రచారంలో జోరందుకుంది. ఎన్నికలకు ఇంకా 11 రోజులు మాత్రమే గడువు ఉండడంతో నేతలు ప్రచారానికి పదునుపెట్టి జిల్లాలను చుట్టేస్తున్నారు. రోడ్ షోలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సభకు మంత్రులు మంత్రి సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరు కానున్నారు.
3,59,672 మంది పట్టభద్రులు
ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 3,59,672 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
అటు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 28,714 మంది ఓటు వేయనున్నారు. ఇక పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు, టీచర్లు 15 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు తిరంలేకుండా తిరుగుతున్నారు.
రంగంలోకి మంత్రులు
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు పెంచింది. ఆ పార్టీ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. రెండు, మూడు నెలల నుంచే నరేందర్ రెడ్డి ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పట్టణ, జిల్లా కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించారు. ఎటు చూసినా ఆయన ఫ్లెక్సీలు, హోర్డింగులు కనిపిస్తున్నాయి. నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు మంత్రి సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ హాజరు కానున్నారు. సభ కోసం కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానం కావడంతో అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా స్థానాన్ని కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
రెండు పార్టీల మధ్య పోటాపోటీ
ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కొమురయ్య బరిలో నిలిచారు. ఇప్పటికే ఈ ఇద్దరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇక కరీంనగర్, మెదక్, నిజామాబాద్ లోసైతం ప్రచార సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు విస్ర్తతంగా ప్రచార సమావేశాల్లో పాల్గొంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పది రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు 46 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు.
తామేం తక్కువ కాదంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు పలు రాజకీయ పార్టీల నుంచే కాకుండా పీఆర్టీయూ, యూటీఎఫ్ఉపాధ్యాయ సంఘాల తరఫున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో ఇటు పట్టభద్రులు, అటు ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఓ వైపు ఫోన్ కాల్స్ చేస్తూనే సోషల్‌మీడియాలోనూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.