
- కామారెడ్డి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ 93.63,
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 78.12 శాతం పోలింగ్
- నిజామాబాద్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ 92.0, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 76 శాతమే..
కామారెడ్డి/ నిజామాబాద్, వెలుగు : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. టీచర్లు ఉదయం నుంచే ఆసక్తి చూపగా, గ్రాడ్యుయేట్ ఓటింగ్ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఊపందుకున్నది. కామారెడ్డి జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఓట్లు మొత్తం 2,011కు గాను 1883 ఓట్లు పోలయ్యాయి. 128 మంది ఓటు వేయలేదు. ఓటింగ్ 93.63 శాతం నమోదైంది.
గ్రాడ్యుయేట్ ఓటర్లు 16,410 మంది ఉండగా, 12,820 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3,590 మంది గైర్హాజరయ్యారు. పోలింగ్ శాతం 78.12 శాతం నమోదైంది. భిక్కనూరులో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఏఎస్పీ చైతన్యారెడ్డి రావడంతో గొడవ సద్దుమణిగింది. బాన్సువాడలో అగ్రో చైర్మన్ బాల్‌రాజు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది.
పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధూశర్మ, అడిషనల్ కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలతో పాటు దోమకొండ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ నుంచి వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు జిల్లా కేంద్రంలోని హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పిట్లంలో , మాజీ విప్ గంప గోవర్దన్ కామారెడ్డిలో, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ లింగంపేటలో ఓటు వేశారు. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద వేచి చూడి పోలింగ్ సరళిని పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 31,574 గ్రాడ్యుయేట్ ఓటర్లకుగాను 24,242 మంది ఓటు వేశారు. గ్రాడ్యుయేట్ఓటింగ్ 76.78 శాతం నమోదైంది. టీచర్ ఓటర్లు 3,751 ఉండగా, 3,468 మంది ఓటు వేశారు. 92.46 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 4 గంటల్లోపు సెంటర్లలో ఉన్నవారికే ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సుభాష్‌నగర్‌లోని ఎస్ఎఫ్ఎస్ కాన్వెంట్ స్కూల్ సెంటర్లో ఓటు వేయగా, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కూడా అక్కడే ఓటు వేశారు. వెబ్ క్యాస్టింగ్ ద్వారా కలెక్టర్ రాజీవ్‌గాంధీ ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. బోధన్ డివిజన్లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లో ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. పోలింగ్ ముగిశాక డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరిన బ్యాలెట్ బాక్స్‌లను కట్టుదిట్టమైన భద్రత మధ్య వాహనాల్లో రాత్రి 8 గంటలకు కరీంనగర్‌లోని కౌంటింగ్ కేంద్రానికి తరలించారు.
పెర్కిట్ లో లైటింగ్ సమస్య..
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ హైస్కూల్ పోలింగ్ సెంటర్ 143, 45 లో లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. నీడ కోసం టెంట్లు వేయకపోవడంతో ఓటర్లు ఎండలో కూర్చున్నారు. వీల్ చైర్ పెట్టలేదు. నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ ఆఫీస్ మూసివేయడంతో ఓటర్ స్లిప్స్ కోసం ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఓటింగ్ పరిశీలిస్తూ ముబారక్‌నగర్ పోలింగ్ సెంటర్‌కు కాషాయ కండువాతో వెళ్లిన బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేష్కులాచారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది.