
- దేశంలో కుల పిచ్చి పెరుగుతుండగా త్యాగ ధనులను మరిచిపోతున్నం
- డీలిమిటేషన్ పేరుతో మూకుమ్మడి దాడి .. ప్రొఫెసర్ నాగేశ్వరరావు
- వరంగల్ లో ఎస్‍ఎఫ్‍ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
వరంగల్, వెలుగు: దేశంలో మతం పేరుతో జరుగుతోన్న దౌర్జన్యాలను అడ్డుకోవాలని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఎస్‍ఎఫ్‍ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కేవలం మనువాదంలోనే అసమానతలున్నాయన్నాని.. దీన్ని అడ్డుకునేందుకు ఎస్సీలు, బీసీలే కాకుండా అగ్రవర్ణాల్లోని ప్రగతిశీల భావాలున్నవారిని ఐక్యం చేసుకుని ముందుకెళ్లాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం సమాజంలో కులపిచ్చి పెరిగిందని.. కులరహిత సమాజాన్ని కోరుకోవాలన్నారు. త్యాగధనులను ప్రపంచం మరిచిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‍ఎఫ్‍ఐతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డీలిమిటేషన్ పేరుతో మూకుమ్మడి దాడి జరుగుతోందని, అది భారత సమాఖ్యపై దాడి అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో ఒకే జాతి, ఒకే మతం, ఒకే ఎన్నిక.. అంటూ కొత్త విధానాలను ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. దేశంలోని 22 కోట్ల మంది ప్రజలు రూ.375 రోజు కూలితో బతుకుతుంటే.. అదానీ మాత్రం రూ.1600 కోట్ల జీతం తీసుకుంటు న్నారన్నారు.
ఈ అసమానతలకు కారణమేంటని ఆయన ప్రశ్నించారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనడం, ఎర్రజెండాలు, కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాల ద్వారానే తాను ప్రేరణ పొందినట్లు సుద్దాల అశోక్‍తేజ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‍ఎఫ్‍ఐ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు జి.రాములు పతాకావిష్కరణ చేయగా.. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ రియాజ్, ఎస్‍ఎఫ్‍ఐ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వీరయ్య, కేయూ మాజీ వీసీ రమేశ్, ఎ.నర్సింహారెడ్డి, పసునూరి రవీందర్, తాళ్ల నాగరాజు, సారయ్య, ప్రభాకర్‍రెడ్డి పాల్గొన్నారు.