జగిత్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టడంతో యువత నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలను కూడా ఇప్పటికీ భర్తీ చేయలేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వ్యవస్థ ఇప్పటికీ అలానే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీ కూడా నేటికీ పూర్తి చేయలేదని చెప్పారు. దళితులకు కేటాయించిన రూ.40 వేల కోట్లను ఖర్చు చేయకపోవడం.. మళ్లీ అదే బడ్జెట్ రిపీట్ చేస్తూ.. దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళిత యువతలో ఏ ఒక్కరికీ దళితబంధు ఇవ్వలేదన్నారు.
సీఎం కేసీఆర్ దళితులతో పాటు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని వరంగల్ సభలో స్వయంగా ప్రధానమంత్రి మోదీ చెప్పారని గుర్తు చేశారు. రాష్ర్ట ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నా సీఎం కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకపోవడం అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వ తీరును ప్రోత్సహిస్తున్నట్లే అని చెప్పారు. దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మైత్రి బంధానికి ఇంతకంటే ఏం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించబోతుందని చెప్పారు.