‘దళితబంధు’ నిర్లక్ష్యానికి గురవుతోంది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 

జగిత్యాల జిల్లా : దళితబంధు పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. 2023లో నియోజకవర్గంలోని 1500 మంది అర్హులకు లబ్ధి చేకూరుస్తామని చెప్పి..15 వేల 700 కోట్ల నిధులు కేటాయించి.. కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. దళితబంధులో బీఆర్ఎస్ నాయకులే 2 నుండి 3 లక్షల వరకు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారని గుర్తు చేశారు. కేవలం ఆరోపణలు రావడంతోనే ఏ ఆధారం లేకుండా తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ నాయకులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. దళితబంధు పథకం గురించి కేవలం ప్రకటనలతోనే పబ్బం గడుపుతున్నారంటూ మండిపడ్డారు. దళితబంధు కార్యక్రమంలో చేతివాటం పాల్పడిన బీఆర్ఎస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే అవినీతిని ప్రోత్సహించిన వారిలో కేసీఆర్ మొదటివారు అవుతారని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పొందిన వారందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు. ఉద్యోగ నియామకాలు జాప్యం చేయడానికే TSPSC పేపర్ లీకేజీ కూడా ఒక ప్రధాన కారణమని ఆరోపించారు.