అవినీతికి కేరాఫ్​గా సిరిసిల్ల సెస్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,  

రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు : సాధారణ వినియోగదారుడు ఒక్క నెల బకాయి ఉంటే కరెంట్ కట్​చేస్తారు, అలాంటిది అదే సర్కారు బకాయి ఉంటే ఎందుకు కట్ చేయరని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ప్రశ్నించారు. వేములవాడ అర్బన్ మండలంలో పొన్నం ప్రభాకర్​తో కలిసి జీవన్​ రెడ్డి సెస్ ఎన్నికల అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గతంలో అవార్డులు పొందిన సిరిసిల్ల సెస్ ప్రస్తుతం అవినీతికి కేరాఫ్​గా మారిందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన సమయంలో విద్యుత్ శాఖకి రూ. 1,300 కోట్ల బకాయి ఉంటే.. నేడు రూ. 21 వేల కోట్లకు చేరాయన్నారు. సెస్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని పల్లెపల్లెకు తీసుకుపోతామని చెప్పారు. జనవరి 26 తర్వాత రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తిని కలుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన డీసీసీ ప్రెసిడెంట్ ఆది శ్రీనివాస్ ను జీవన్ రెడ్డి, పొన్నం సన్మానించారు.