కాళేశ్వరంతో తెలంగాణ నవ్వుల పాలైంది: జీవన్ రెడ్డి

  •    ఉద్యమ నాయకుడిగా అవకాశం ఇస్తే కేసీఆర్  ఫెయిలైండు
  •     జగిత్యాల కాంగ్రెస్  అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
  •     సర్కారు మారాలని ప్రజలు కోరుకుంటున్నరు
  •     కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  కేసీఆర్​ను జైలుకు పంపుతామని కామెంట్

జగిత్యాల, వెలుగు : రూ.లక్షల కోట్ల అప్పుచేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ నవ్వుల పాలైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్  అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ సాంకేతిక లోపాలపై ఎంక్వయిరీ చేపట్టి కేసీఆర్ తో సహా అవినీతికి పాల్పడిన ఆఫీసర్లను కటకటాల్లోకి పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో ఆఫీస్ లో ఏఐసీసీ కార్యదర్శి వంశీ చందర్ రెడ్డి తో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నామినేషన్  దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎప్పుడో నిర్మించిన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెక్కుచెదరకుండా పటిష్టంగా ఉన్నాయని గుర్తుచేశారు. 

ముందే ఊహించినట్లు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా మారిందన్నారు. ఉద్యమ నాయకుడిగా భావించి ప్రజలు కేసీఆర్ కి రెండు టెర్ములుగా అధికారం ఇస్తే, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో విపలమయ్యారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి ప్రజల హక్కు అని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. అలాగే కామారెడ్డి లో సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్  అభ్యర్థి రేవంత్  రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నదన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తే  కనీసం ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయలేదని బీఆర్ఎస్  సర్కారుపై ఆయన మండిపడ్డారు. 

రాష్ట్ర  ప్రభుత్వంపై ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్  సర్కార్ క్వింటాల్ పై ఐదు నుంచి పది కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నదని ఫైర్  అయ్యారు. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ విజయానికి జగిత్యాల నియోజకవర్గం నుంచి నాంది పలకాలని ఓటర్లను జీవన్ రెడ్డి కోరారు. నామినేషన్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. 

అంతకుముందు జీవన్ రెడ్డి మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ముడుపు కట్టారు. అనంతరం  జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్  నుంచి జంబి గద్దె మీదుగా గొల్లపల్లి రోడ్డు, పాత బస్టాండ్  మీదుగా ర్యాలీగా వెళ్లారు.