జగిత్యాల టౌన్, వెలుగు: రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత వల్లే బీఆర్ఎస్తుడిచిపెట్టుకుపోయిందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ లోక్‌సభ సీటుతో పాటు కోల్‌బెల్ట్ పరిధిలో బీఆర్ఎస్ ఓడిపోవడం దొరసాని కవిత పుణ్యమేనని ఎద్దేవా చేశారు. గురువారం స్థానిక ఇందిరాభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్న జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న కవితకు కార్మికులు గట్టిగా బుద్ధి చెప్పారని, సింగరేణి ఎన్నికల్లో ఆ సంఘం పొటీలో కూడా లేకుండా పోయిందన్నారు.
ఐదేండ్లు ఎంపీగా ఉన్న ఆమె ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని, ఉన్న షుగర్ ఫ్యాక్టరీని కూడా మూసేయించిందని విమర్శించారు. వారు మూసేసిన ఫ్యాక్టరీని తాము తెరిపిస్తామని చెప్పారు. ‘‘కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూవ్యతిరేక ధోరణి ఉందన్న కవిత ఏ మతాన్ని గౌరవిస్తుంది. బతుకమ్మ ఆడగానే హిందూ మతం మీద గౌరవం ఉన్నట్టా’’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ముస్లింల గురించి మాట్లాడే కవిత వారి హక్కుల గురించి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అన్ని మతాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ఆదాయ మార్గాలు పెంచుకుని, అవినీతిని, దుబారాను అరికట్టి ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.