- ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి
- మద్దతు ధర లేక పసుపు విస్తీర్ణం పడిపోయింది
జగిత్యాల, వెలుగు : పసుపు బోర్డు ఏర్పాటు కోసం 2023 అక్టోబర్ లో జీవో రిలీజ్ అయిందని, అది ఎక్కడ ఏర్పాటు చేశారో ప్రధాని మోదీ చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నిలదీశారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని ఇందిరా భవన్ లో ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతితో కలిసి మాట్లాడారు. నిజామాబాద్ లో పసుపు సాగు 2019 లో 50 వేల ఎకరాల్లో ఉంటే.. గిట్టుబాటు ధర లేక అది19 వేల ఎకరాలకు తగ్గిందన్నారు.
రైతులను ఆదుకోనే ఉద్దేశముంటే పసుపు క్వింటాల్ కు మద్దతు ధర రూ.15 వేలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీ గురించి మోదీ మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టైంలో 2001- -2002లో టీడీపీ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించిందన్నారు. తర్వాత బీఆర్ఎస్ సర్కార్ మొత్తానికే మూసేసిందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పున ప్రారంభించాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రం కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేదని, అందుకే అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ప్రాజెక్టును పూర్తి స్థాయి పర్మిషన్లు లేకుండా నిర్మిస్తే చూసీ చూడనట్లు వ్యవహరించింది మోదీ సర్కారేనని విమర్శించారు. అవినీతిపై నిష్పక్షపాత విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఖాతా తెరవడం కూడా కష్టమేనని జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే దేశంలోనూ రిపీట్అవుతాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్రహస్య స్నేహితులు కాబట్టే అన్ని ఆధారాలు ఉన్నా తెలంగాణలో బీఆర్ఎస్అధికారంలోకి వస్తుందని కవితను ఇంతకాలం అరెస్ట్ చేయలేదన్నారు.