జగిత్యాల జిల్లా : మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాదిరిగా వాస్తవాలను వక్రీకరించడం రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. 2018 ఎన్నికల్లో రుణమాఫీ ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు రామారావు... బతుకు తెరువు కోసం అమెరికాకు వెళ్లావు కదా అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు రైతుబంధు ఐదు ఎకరాలకు పరిమితమైందని, ఇదేనా రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి అని వ్యాఖ్యానించారు. రైతుబంధు పథకం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని 24 గంటల విద్యుత్ వస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విద్యుత్ పట్ల చర్చ లేవనెత్తడంతోనే ప్రస్తుతం 24 గంటల పాటు కరెంటు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వాస్తవాలు ఒకలా ఉంటే కేటీఆర్ మరోలా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టారని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న 16 మంది మంత్రుల్లో 15 మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారని అన్నారు.
అదనపు తూకం లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. రైతులను వ్యాపారులు దగా చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారుల అక్రమాలను అరికట్టడం కేటీఆర్ బాధ్యత కదా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఏది అని అడిగారు. వరి ధాన్యం కోతలు పెట్టినప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వ పని అయిపోయిందన్నారు. పూటకో మాట మాట్లాడే వ్యక్తి కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్ పార్టీలోనే జరిగిందన్నారు. బీఆర్ఎస్ చంద్రబాబు వారసత్వ పార్టీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు డైరెక్షన్ తోనే బీఆర్ఎస్ నడుస్తోందన్నారు.