గతంలో నిరుపేద వర్గాలకు కాంగ్రెస్ పార్టీ భూమి హక్కు దారునిగా చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పుడ్ ప్రాసెసింగ్ కోసం కాంగ్రెస్ ఇచ్చిన భూములను లాక్కోవడం చాలా బాధాకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ కు వ్యవసాయం గురించి ఏం తెలుసన్నారు. గంగులకు 100 ఎకరాల భూమిని ఇచ్చారట అని ఆరోపించారు. అమరుల ఆకాంక్ష అంటే నిరుపేద వర్గాల పొట్ట కొట్టడమా..? అని ప్రశ్నించారు. సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులోనిపల్లి, వర్గల్ లో భూములు కోల్పోయిన రైతులు న్యాయం చేయాలంటూ చేపట్టిన దీక్షకు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీ పీసీసీ రైతు విభాగం ఉపాధ్యక్షులు కొదండ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి మద్దతు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానంటే గెలిపించారని, ఇప్పుడు ఉన్న భూమిని గుంజుకుంటున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. గంగుల కమలాకర్ పెద్ద గ్రానైట్ వ్యాపారని, ఆయనకు ఇక్కడ వంద ఎకరాల భూమి ఎందుకని ప్రశ్నించారు. దళితుల భూములను ఆక్రమిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తామన్నారు. దేశానికే తెలంగాణ మోడల్ అంటున్నప్పుడు.. గుజరాత్ కు చెందిన అమూల్ కంపెనీ రాష్ర్టంలో ఎందుకని ప్రశ్నించారు. వేలాది మంది రైతుల పొట్ట కొట్టి 10 మంది ధనిక వ్యాపారులకు లబ్ది ఎందుకని ప్రశ్నించారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నారని నిరూపిస్తూ శ్వేతపత్రం విడుదల చేస్తే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు.