తన బలం బలగం జగిత్యాల ప్రజలేనన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటూ సేవలు అందిస్తున్నానని చెప్పారు. తనను గెలిపిస్తే పార్లమెంట్ లో తన మొదటి ప్రసంగం చెక్కర కర్మాగారం కోసమే చేస్తానని తెలిపారు. చనిపోయే వరకు ప్రజా సేవలో ఉంటా..ఆరోగ్యం బాగలేకున్నా ఫోన్ లో మాట్లాడి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.
వచ్చే ఏడాది డిసెంబర్ లోపు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. దసరాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. జీవన్ రెడ్డి ఆత్మీయతకు.. అరవింద్ అహంకారానికి మద్య జరుగుతున్న పోటీ అన్నారు. జగిత్యా ల ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.
ఐదేళ్లలో ఎంపీగా అరవింద్ చేసిందేమి లేదని విమర్శించారు జీవన్ రెడ్డి. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేస్తూ మళ్లీ ఎన్నికల వేళ ఓటర్లను మభ్య పెట్టేందుకు వస్తున్నారని తెలిపారు. రాముడిపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న భక్తి బీజేపీకి లేదన్నారు. 50ఏళ్ల క్రితమే నిర్మించిన పోచంపాడు ప్రాజెక్టుకు రాముని పేరుతో శ్రీరామ్ సాగర్ పేరు పెట్టామని చెప్పారు.