అప్పుడు మద్దతు తెలిపి.. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నరుకరీంనగర్, వెలుగు: దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం కోసం 2015లో కేంద్ర ప్రభుత్వం మైన్స్, మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులరైజేషన్ యాక్ట్ లో సవరణలు చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి టీఆర్ఎస్ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్ మద్దతు తెలిపి అనుకూలంగా ఓట్లు వేశారని గుర్తు చేశారు.
ఆ చట్టానికి అనుగుణంగానే ఇప్పుడు బొగ్గు గనుల వేలం జరుగుతోందని, అప్పుడు చట్టాన్ని సమర్థించినవారే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణికి కేటాయించిన గనుల్లో బొగ్గు తీయకపోవడం, గనులను విస్తరించకపోవడంతో కార్మికుల సంఖ్య 60 వేల నుంచి 43 వేలకు తగ్గిపోయిందన్నారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ లను ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రం ప్రైవేట్ పరం చేయదని పేర్కొన్నారు. ఒకప్పుడు 35,000 కోట్ల డిపాజిట్లు ఉన్న సింగరేణి ఇప్పుడు అప్పుల్లో ఉందని విమర్శించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ చర్చ లేకుండా ఉండేందుకే టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీని తెరమీదికి తెచ్చారని, కానీ అసలు సమస్య టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీయేనని అన్నారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుట్రదారులేనని ఆరోపించారు.