జగిత్యాల, వెలుగు: రాముడి పేరు చెప్పుకోగానే సరిపోదని, రామ రాజ్య నిర్మాణం ఎప్పుడు అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతలేవరో, దేశ ప్రజల సమగ్రతకు ప్రాణాలు అర్పించిన వారెవరో బీజేపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు. బ్లాక్ మనీని పేదోళ్ల అకౌంట్స్ లో వేస్తానని మాట తప్పిన మోదీకి శ్రీరాముడితో పోలిక ఎక్కడిదన్నారు. ఎంపీ అర్వింద్ కు ఎన్నికల టైంలోనే షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. కానీ కాంగ్రెస్ హామీ మేరకు రైతుల కోసం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఇప్పటికే పనులు మొదలు పెట్టినట్లు గుర్తు చేశారు. ఫ్రీ బస్ సర్వీస్ కు సంబంధించి మహిళలపై బీజేపీ నేతల మాటలు సరికాదన్నారు. ధరూర్ రామాలయం భూములు కబ్జా కాకుండా కాపాడి అప్పుడే జై శ్రీరాం అని నినదించానని గుర్తు చేశారు.
టాటా ఎయిర్ లైన్స్ ప్రైవేట్ సంస్థను ఎయిర్ ఇండియా ప్రభుత్వ సంస్థగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అయితే, రైల్వేను ప్రైవేటీకరణ చేసిన ఘనత బీజేపీదని ఎద్దేవా చేశారు. విజయ సంకల్ప యాత్రలో తాము చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి గానీ, రెచ్చకొట్టే వాఖ్యలు చేసి ప్రజలను మభ్యపెట్టకూడదన్నారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ చాంద్ పాషా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ బాబు, మాజీ ఎంపీటీసీ చందా రాజకిషన్ రావు, గాజుల రాజేందర్ పాల్గొన్నారు.