మైనింగ్ అధికారులను విధుల్లోంచి తొలగించాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికారులు మట్టి తవ్వకానికి అనుమతులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మట్టి తవ్వకూడదని జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవ తీర్మానం చేశారని జీవన్ రెడ్డి చెప్పారు. అయినా కూడా గ్రామ శివారులో నియమావళిని ఉల్లంఘిస్తూ.. మైనింగ్ అధికారులు క్వారీ, మట్టి తవ్వకాలకు అనుమతులిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు ఎన్నికల నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన అవసరం లేదా అని నిలదీశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన అధికారులపై ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. 

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, అనుమతులు మంజూరు చేసిన మైనింగ్ అధికారులతోపాటు, నర్సింగాపూర్ పంచాయతీ కార్యదర్శిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించి, విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.