కేసీఆర్ మాదిరే మనం చేస్తే ఎలా?..రాహుల్ ఏం చెప్పారు..మనం ఏం చేస్తున్నం: జీవన్ రెడ్డి

కేసీఆర్ మాదిరే మనం చేస్తే ఎలా?..రాహుల్ ఏం చెప్పారు..మనం ఏం చేస్తున్నం: జీవన్ రెడ్డి
  •  కాంగ్రెస్ ను బ్లాక్ మెయిల్ చేసి ఫిరాయింపులు
  •  ఫిరాయింపుల ముఠా నాయకుడు పోచారం
  • నా అనుచరుడు గంగారెడ్డి ఫస్ట్ నుంచి కాంగ్రెస్సే
  • అతణ్ని మార్కెట్ కమిటీ  చైర్మన్ చేయాలనుకున్నా
  • ఎమ్మెల్యే సంజయ్ అండతోనే ఈ హత్య జరిగింది
  • నిందితుడు సంతోష్ కాంగ్రెస్ వ్యతిరేకి 
  • ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మాదిరిగానే మనం చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విధానం ఏమిటి..? రాహుల్ గాంధీ ఏం చెప్పారు..? మని ఇక్కడ ఏం చేస్తున్నామని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపు దారులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఇంట్లో అందరూ సమావేశమై తీర్మానించారని చెప్పారు. నియోజకవర్గాల బాధ్యతలను ఫిరాయింపు దారులకే అప్పగించాలని తీర్మానించారని కుండబద్దలు కొట్టారు. 

సంఖ్యాబలం ఉన్నా ఫిరాయింపులెందుకు..?

అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఫిరాయింపులు చేస్తుండటంతో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటైనా.. సుస్థిర పాలన అందించేంత బలం కాంగ్రెస్ పార్టీకి ఉందని, అయినప్పటికీ ఫిరాయింపులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్రజాస్వామిక పద్ధతిలోనే పార్టీ ఫిరాయింపులు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తూ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  

గంగారెడ్డి హత్య వెనుక ఎమ్మెల్యే సంజయ్

తన అనుచరుడు గంగారెడ్డి ఓటు  హక్కు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, ఆయనను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించాలని తాను సిఫార్సు చేశానని, అంతలోనే ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడు బితిని సంతోష్ గంగారెడ్డిని కారుతో ఢీకొట్టి 20 కత్తిపోట్లు పొడిచి కిరాతకంగా హత్య  చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ముసుగులోనే గంగారెడ్డిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  

పోచారం ఏం సలహా ఇస్తారు

పార్టీ ఫిరాయింపు దారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన పోచారం ఏం సలహా ఇస్తారో తనకైతే అర్థం కావడం లేదన్నారు. పార్టీ ఫిరాయింపులను ఏ విధంగా క్రమబద్ధీకరించుకోవాలనే విషయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్ పర్ట్ అని మండిపడ్డారు. కేసీఆర్ ఆనాడు గంపగుత్తా పార్టీలో చేర్చుకుంటే ఏం జరిగిందో అందరికీ తెలుసని జీవన్ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్ ముసుగేసుకొని దౌర్జన్యం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని అంటున్నారని జీవన్ రెడ్డి చెప్పారు. అప్పడు బీఆర్ఎస్ లో ఉండి సంజయ్ దౌర్జన్యం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ముసుగు వేసుకొని దౌర్జన్యానికి దిగుతున్నాడని మండిపడ్డారు. 

అవసరమైతే సీఎంను కలుస్తా

ఈ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి సీఎంకు అంతా తెలుసని అన్నారు. అవసరమైతే విషయాన్ని వివరించేందుకు సీఎం ను కలుస్తానని చెప్పారు. ఇప్పటికే ఆయనకు లేఖ చేరిందని భావిస్తున్నట్టు చెప్పారు.