అలక వీడిన జీవన్ రెడ్డి

అలక వీడిన జీవన్ రెడ్డి
  • ఢిల్లీలో దీపాదాస్​ మున్షీ, కేసీ వేణుగోపాల్​తో భేటీ
  • కార్యకర్తల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలన్న జీవన్​రెడ్డి
  • సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తామని వేణుగోపాల్ హామీ

న్యూఢిల్లీ, వెలుగు: ఎట్టకేలకు కాంగ్రెస్​పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకవీడారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం, గౌరవం ఇస్తామని పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. హైకమాండ్ పిలుపుతో అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జీవన్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లారు. తొలుత పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి శ్రీధర్ బాబుతో తెలంగాణ భవన్ లోని శబరి బ్లాక్ లో అరగంట పాటు చర్చలు జరిపారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి తన పంతం వీడకపోవడంతో వేణుగోపాల్ పిలుపు మేరకు ఆయన నివాసానికి వెళ్లారు.

జీవన్ రెడ్డితో దాదాపు అరగంట పాటు వేణుగోపాల్ ప్రత్యేకంగా మాట్లాడి చల్లబడేలా చేశారు. పార్టీలో సీనియర్ నేత అయిన తనకు స్థానికంగా జరిగిన పరిస్థితులతో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఫైనల్​గా ఆయనకు పార్టీ అండగా ఉంటుందన్న హామీతో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలిసింది. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని, వారి ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు, ఆవేదనను పరిగణనలోకి తీసుకోవడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అన్నారు.  

బీఆర్ఎస్​కు నైతికత ఉండాలి: శ్రీధర్ బాబు

పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ కు కొంచమైనా నైతికత ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పదేండ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీని చీల్చి, బలహీన పరిచి ఇప్పుడు వాళ్లే పార్టీ ఫిరాయింపులపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అంతం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తోందని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 

చేరికలకు డోర్లు తెరిచే ఉన్నాయి: దీపాదాస్

కాంగ్రెస్ లో చేరికలకు డోర్లు తెరిచే ఉన్నాయని పార్టీ స్టేట్​ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ అన్నారు. అయితే, పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం తగ్గకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. పీసీసీ చీఫ్ మార్పుపై స్పందిస్తూ.. పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఏమీ లేదన్నారు. ఆ విషయంలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. జీవన్ రెడ్డి పార్టీలో సీనియర్ నేత, ఆయన కించపరచడం తమ ఉద్దేశం కాదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే చేరికతో ఆయన కొంత అమర్యాదగా భావించారని చెప్పారు. ప్రస్తుతం పార్టీలో ఎవరూ అసంతృప్తిగా లేరని ఆమె అన్నారు.