మీ వెంటే నేనుంటా.. గీత కార్మికులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : గీత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు చల్ గల్ లో బావి, పైప్ లైన్ నిర్మాణం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంగళవారం (జూన్ 20న) భూమి పూజ చేశారు. జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో జూన్ 16న ఈత వనం ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఈత వనంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు బావి, పైపు లైన్ల ఏర్పాటు కోసం రు.5 లక్షల సీడీపీ నిధులు మంజూరు చేయించి.. భూమి పూజ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా అభిమానంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కల్లు పోశారు గీత కార్మికులు. 

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన గీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదంలో ఈత చెట్లు కాలిపోయి, ఉపాధి కోల్పోయిన కార్మికులకు పరిహారం అందించి, వారి వృత్తికి భరోసా కల్పించాలని కోరారు. తాను ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన కాలం నుండి గీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ, వారి వెంటే ఉంటున్నానని చెప్పారు. గీత కార్మికుల సహకార సంఘాలను ఏర్పాటు చేసి, వారి ఉపాధికి భరోసా కల్పించామన్నారు. గీత కార్మికులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, వారికి అండగా తాను ఉంటానని భరోసా ఇచ్చారు జీవన్ రెడ్డి.