జగిత్యాల టౌన్, వెలుగు: మూసీ నది ప్రక్షాళన ఆవశ్యకతను తెలిపేందుకే సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మూసి నిర్వాసితులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని వారికి ఉపాధి కల్పించడంతో పాటు పునరావసం కల్పిస్తామన్నారు. స్థానిక ఇందిరా భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీటు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రజా జీవితం యువకులకు ఆదర్శమన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను తీర్చిదిద్దేందుకు మూసీ ప్రక్షాళన చేపట్టారన్నారు. మూసీ ప్రాజెక్టు ప్రక్షాళనతో మురికినీరు శుద్ధిచేసి, నల్గొండకు సాగునీరు అందిస్తామన్నారు.
వేములవాడ: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుతోనే ప్రజాపాలన సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. వేములవాడ మండలం దమ్మన్నపేట గ్రామంలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెబుతూ కేక్ కట్ చేశారు. వైస్ చైర్మన్ బింగి మహేశ్, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రాకేశ్, దమ్మన్నపేట గ్రామస్తులు పాల్గొన్నారు.