- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
రాయికల్, వెలుగు : జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్, జగిత్యాల, బీర్‌పూర్ మండలాల్లోని ఫిల్టర్ బెడ్ పథకాల పునరుద్ధరణకు రూ.13.97కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. బుధవారం రాయికల్ పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ పేరుతో గత సర్కార్ ఫిల్టర్‌బెడ్ పథకాలను నిర్వీర్యం చేసిందని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి పథకాలకు ప్రాధాన్యమిచ్చి ప్రజల నీటికష్టాలను తీరుస్తామన్నారు. తాగునీటి పథకాల పునరుద్ధరణకు రాయికల్ మండలానికి రూ.4.97కోట్లు
బీర్‌పూర్ మండలానికి 3.70కోట్లు, జగిత్యాల మండలానికి రూ.5.30కోట్లు మంజూరైనట్లు చెప్పారు. రాయికల్ మండలం కుమ్మరిపెల్లి నుంచి రాయికల్ మండలకేంద్రానికి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు 2.17కోట్లు, రాయికల్ ప్రభుత్వ కాలేజీ నుంచి ఇటిక్యాల వడ్డెరకాలనీ వరకు రోడ్డు నిర్మాణ పనులకు రూ.1.60కోట్లు మంజూరైనట్లు వివరించారు.
అంతకుముందు తన కాలు ఆపరేషన్‌కు సీఎం సహాయనిధి అందించి ఆదుకోవాలని కూచిపూడి నృత్యకారిణి బొమ్మకంటి అంజనశ్రీ ఎమ్మెల్సీని వేడుకున్నారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు మ్యాకల రమేశ్, మహిపాల్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, మున్నూ, గోపి రాజరెడ్డి, సాగర్, తదితరులు పాల్గొన్నారు.