జగిత్యాల రూరల్, వెలుగు : ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం అప్పు చేసైనా రూ.21 వేల కోట్లతో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ప్రభుత్వం రైతు భరోసా అమలుకు పూనుకుందని బీజేపీ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు మానుకొని ప్రజలకు మంచి జరిగితే హర్షించాలన్నారు.
సంక్రాంతి తర్వాత రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున అందిస్తామని, రైతు కూలీలకు ఏటా రూ.12వేల సాయం అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రాళ్లు రప్పలు, రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చినట్లు కాకుండా సాగు భూములకే ఇస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, లీడర్లు బండ శంకర్, నందయ్య,రాజేందర్, అశోక్, దుర్గయ్య పాల్గొన్నారు.