మాస్టర్ ప్లాన్ రద్దుపై కలెక్టర్ ప్రకటన చేయాలె : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు  జిల్లా కలెక్టర్ ప్రకటన జారీ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.  మాస్టర్ ప్లాన్  వల్ల రైతులు పండగ పూట కూడా  కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపలేని పరిస్థితి వచ్చిందన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో  రైతులు మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ  పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. జీవన్ రెడ్డి కూడా ఈ నిరసనలో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మాస్టర్ ప్లాన్ రద్దును  ప్రకటనలకు పరిమితం చేయకుండా  జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు ఓ ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ లో  పొందుపరిచిన  ఇండస్ట్రియల్ జోన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతిచ్చే పరిస్థితి లేదని జీవన్ రెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన ప్రభుత్వ రెవెన్యూ భూములు ముమ్మాటికి ఆ గ్రామంలోని దళితులకు, పేద వర్గాలకు  చెందాలని చెప్పారు.  ధరణిలో ఉన్న లొసుగులను అక్రమార్కులు ఆసరాగా చేసుకొని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై  గ్రామానికి ఎలాంటి సంబంధం లేని  వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు.