కేసీఆర్ మోసానికి గురికాని వర్గం లేదు : జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు : తెలంగాణలో సీఎం కేసీఆర్​ మోసానికి గురికాని వర్గం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం అత్మారం ఫంక్షన్ హాల్ లో రాబోయే ఎలక్షన్స్ పై నాయకులు, కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ బంధు అంటూ మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. 2019 తర్వాత ఎన్ని నిధులు తెచ్చారో ఎమ్మెల్యే సంజయ్ చెప్పాలన్నారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంపిణీ చేయబోమని బీఆర్ఎస్ అభ్యర్థులతో తెలంగాణ తల్లి పై ప్రమాణం చేయించాలని మంత్రి కేటీఆర్ కు సవాలు విసిరారు. డీసీసీ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్యక్రమంలో  మోహన్,  నాగభూషణం,శంకర్  తదితరులు పాల్గొన్నారు.