జగిత్యాల మాస్టర్​ ప్లాన్​ రద్దు చేసే వరకూ రైతుల పక్షానే : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను పూర్తిగా తొలిగించే వరకూ రైతుల పక్షాన పోరాడుతామని కాంగ్రెస్​ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రకటించారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ప్రకారం పట్టణం పరిసర గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటు చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. నాలుగు నెలల క్రితం మాస్టర్ ప్లాన్ కోసం గ్రామ పంచాయతీల నుంచి తీర్మానాలు చేశారని, ఇప్పుడు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. 

తాను తప్పు మాట్లాడినట్లయితే దేనికైనా సిద్ధమని, వాస్తవాలు చెప్పటమే తన బాధ్యతని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జీవో 238ను  రద్దు చేయాలని డిమాండ్​చేశారు. మాస్టర్ ప్లాన్ పై కమిటీ వేసి గ్రామాలను తొలగించాలని కోరారు. మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ తో 6 గ్రామాల రైతులు, ప్రజలు15 రోజులుగా ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రైతులు కడుపు కాలి రోడ్డెక్కితే రాజకీయం చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే జగిత్యాల మున్సిపాలిటీ.. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేసిందని చెప్పారు. జగిత్యాల మున్సిపాలిటీ రద్దు తీర్మానం పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్లు మాత్రమే అని వ్యంగ్యంగా మాట్లాడారు.