కాంగ్రెస్ చేతల ప్రభుత్వం..ఇచ్చిన మాట తప్పదు : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం.. ఇచ్చిన మాట తప్పదన్నారు. జగిత్యాల అభివృద్ధికి బాటలు వేసిందే కాంగ్రెస్ పార్టీయే అన్నారు. థై బజార్ పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై చర్చించారు. ముఖ్య కార్యకర్తల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడారు. 

కాంగ్రెస్ పాలన పదేళ్ల కాలంలో ఏం చేశామో.. బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్లలో ఏం చేసిందో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించి చెప్పాలని కోరారు. జగిత్యాల పట్టణాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేశామన్నారు. జగిత్యాల అభివృద్ధికి బాటలు వేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. 90 శాతం బడుగు, బలహీన వర్గాలను విస్మరించి.. కేవలం 10 శాతం కులాలకు 400 మందికి మాత్రమే బీసీ బంధు ఇచ్చారని చెప్పారు. 

గృహలక్ష్మి పథకం కింద లబ్దిదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మంజూరు పత్రాలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గృహలక్ష్మి లబ్దిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వమే పథకం అమలు చేస్తుందన్నారు. దళిత బంధు కోసం 2022-23లో ప్రతి నియోజకవర్గంలో 1500 మందికి దళిత బంధు కేటాయించేందుకు రూ.17 వేల 700 కోట్లు బడ్జెట్ లో కేటాయించి.. ఒక్కరికీ కూడా దళిత బంధు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2023-24లో కూడా మరోసారి రూ.17 వేల 700 కోట్లు కేటాయించి.. నేటికీ దళిత బంధు మంజూరు పత్రాలు ఇవ్వలేదన్నారు. నిజమైన లబ్ది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరుగుతుందన్నారు. దేశంలోనే మొదట ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ ను బీఆర్ఎస్ కేవలం కొనసాగిస్తోందన్నారు.  ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్​ పార్టీకే పేటెంట్ హక్కు ఉందన్నారు.

ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. బాలిక సంరక్షణ పథకం కింద రెండు లక్షల పథకం రద్దు చేసి.. లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కల్యాణలక్ష్మి అమలు చేయడంతో పాటు పెళ్లి అయిన నవ వధువుకు తులం బంగారం ఇస్తామన్నారు. భగీరథ పేరుతో రూ.40 వేల కోట్ల ఆర్థిక భారం మోపారని ఆరోపించారు. మైనారిటిలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.