జగిత్యాల టౌన్, వెలుగు: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చాడని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఇందిరా భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కు రెండుసార్లు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు.
కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ప్రజలకు ఆయన పట్ల వ్యతిరేకతకు అద్దం పడుతోందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే డబుల్ బెడ్ రూం ఇల్లు రద్దుచేస్తారని ప్రచారం చేసి, లబ్దిదారులను భయాందోళనలకు గురిచేశారని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోకసభ సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టి, వాస్తవాలను వెలికి తీసి తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు.
తమ్మిడి హెట్టి బ్యారేజి ని కేవలం 10వేల కోట్లతో నిర్మాణం చేపడితే నేరుగా సుందిళ్లకు నీటిని సరఫరా చేయవచ్చని, బ్యారేజ్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా కేసీఆర్ కేవలం కమిషన్ల కక్కుర్తితో కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ సంజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు మానసిక స్టెర్యం కోల్పోవద్దన్నారు. జగిత్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, నందయ్య, దుర్గయ్య, రాజేందర్, అశోక్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.