జగిత్యాల రూరల్, వెలుగు : ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాలను అభివృద్ధికి కేరాఫ్‌గా తీర్చిదిద్దానని, జగిత్యాల అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌ను తానేనని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ హయాంలో జగిత్యాలలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ఆ పార్టీ లీడర్లు అభివృద్ధిపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ పథకం కింద 4వేల ఇండ్లు మంజూరు చేయించి, టీఆర్‌నగర్‌లో నిర్మించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాక్ శిక్షణ కేంద్రాన్ని జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఘనత తనదేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో రూ.200కే నల్లా కనెక్షన్ అమలు చేయడమే కాకుండా, ప్రతి గ్రామంలో శుద్ధి చేసిన నీరు అందేలా ఏర్పాటు చేశానన్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ లీడర్లు బండ శంకర్, దుర్గయ్య ఉన్నారు.