రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా సీఎం కేసీఆర్ అంబేద్కర్ భవనంలో సామాన్యుల కోసం సమయం కేటాయించాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా పారదర్శక పాలన సాగించాలని తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపిస్తుందని..వారికి కేటాయించిన నిధులు 8 ఏండ్లు గడుస్తున్నా ఖర్చు చేయలేదని ఆరోపించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికను కలెక్టర్ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. దళితబంధు పేరిట పదిలక్షల ఇచ్చి భూమి ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందన్నారు. దళిత బంధు అర్హులకు కాకుండా.. టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని మండిపడ్డారు. CM కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గిరిజనులకు జనాభా ప్రాతిపదిక న 10శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో నీట్, ఇంజినీరింగ్ సీట్ల భర్తీతో పాటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు.ఇందిరా సహాని కేసును సాకుగా చూపుతూ సీఎం కేసీఆర్ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.