- అయితే నిజామాబాద్ లేదంటే కరీంనగర్ నుంచి...
- పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు
- క్యాడర్‌తో ఎమ్మెల్సీ సమాలోచనలు
కరీంనగర్, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆశావాహుల నుంచి అప్లికేషన్లు తీసుకున్న అధిష్ఠానం బలమైన అభ్యర్థులను గుర్తించే పనిలో పడింది. అదే టైంలో కొందరు ముఖ్య లీడర్లతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని లోక్ సభ బరిలో నిలపాలని నిర్ణయించిన హైకమాండ్.. కరీంనగర్ లేదా నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఆయన తన క్యాడర్‌తో సమాలోచనలు చేస్తునట్లు తెలిసింది.
రెండు స్థానాల్లోనూ జీవన్ రెడ్డికి పట్టు..
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నిజామాబాద్, కరీంనగర్ రెండు లోక్ సభ స్థానాల్లోనూ మంచి పట్టు ఉంది. సీనియర్ నేతగా ఆయనకు పార్టీ శ్రేణుల్లో గౌరవనీయ స్థానం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉండగా..తన సొంత నియోజకవర్గమైన జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో ఉండడం ఆయనకు కలిసొస్తుందని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై ఆయన తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ చార్జీలతో చర్చించాకే జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని హైకమాండ్‌కు తెలియజేస్తారని అనుచరులు చెప్తున్నారు.
2008లో కరీంనగర్ ఉప ఎన్నికలో పోటీ..
కరీంనగర్ లోక్ సభ స్థానానికి 2008లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి కేవలం 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత ఆయన ఎప్పుడూ లోక్‌సభకు పోటీ చేయలేదు. 2019లో జరిగిన మెదక్ కరీంనగర్, --ఆదిలాబాద్, -నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి శాసన మండలిలో అడుగుపెట్టారు. నిత్యం నిరుద్యోగులు, రైతుల సమస్యలపై గళమెత్తే జీవన్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా..ఆయన కరీంనగర్ లేదా నిజామాబాద్ లలో ఎక్కడి నుంచి నిలబడినా బీజేపీ సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కు గట్టి పోటీ ఇస్తారని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇద్దరు బీజేపీ సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిపై జీవన్ రెడ్డి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.
ALSO READ: మానుకోట కాంగ్రెస్ టికెట్ కోసం పోటాపోటీ