ప్రజలు ఏసీబీ బిల్లులపై ఆందోళన చెందవద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఏసీడీ ఛార్జీల గురించి తాను జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడానని చెప్పారు. కేవలం NPDCL పరిధిలోని జిల్లాల్లో మాత్రమే ఇవి వసూలు చేస్తున్నారని తెలిపారు. ఏసీడీ బిల్లుల వసూలు నిలిపివేస్తామని ప్రభాకర్ రావు తనకు హామీ ఇచ్చారని అన్నారు. అదనపు విద్యుత్ లోడుకు అదనంగా లోడింగ్ ఛార్జీ వసూలు చేస్తున్న విద్యుత్ సంస్థలు.. ఇప్పుడు మళ్లీ ఏసీడీ ఎందుకు వసూలు చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. గతంలో గృహేతర విద్యుత్ వినియోగదారుల నుంచి మాత్రమే ఏసీడీ వసూలు చేసేవారని.. ఇప్పుడు నిరుపేదల వద్ద నుంచి ఆ విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ సంస్థల నష్టాలు పూడ్చుకునేందుకే ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. విద్యుత్ బిల్లులపై అవసరమైతే కరీంనగర్ నుంచి మరో పోరాటం చేస్తామని జీవన్ రెడ్డి చెప్పారు.
24 గంటల కరెంట్ కావాలని తామెప్పుడూ అడగలేదని.. కేవలం 13 గంటలు ఇస్తే చాలని జీవన్ రెడ్డి అన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని ఇప్పుడు విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు చెబుతున్నాడని ఆయన విమర్శించారు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని అన్నారు. అసలు ఎన్నిగంటలు కరెంటు ఇస్తున్నారు? ఎన్ని గంటలు ఇవ్వగలుగుతారో చెప్పండి అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి పవర్ ప్లాంట్, భగీరథ మంచినీటి స్కీం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి గుదిబండ కాబోతున్నాయని ఆయన ఆరోపించారు. బొగ్గు దొరికే ఎన్టీపీసీని వదిలేసి.. ఎలాంటి బొగ్గు దొరకని ప్రాంతమైన యాదాద్రిలో ఎందుకు విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తున్నారని ఆయన నిలదీశారు. కమీషన్ల కక్కుర్తితోనే యాదాద్రిలో పవర్ ప్లాంట్ కడుతున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి వల్ల 40 వేల కోట్ల అప్పుల భారం రాష్ట్రంపై పడుతుందని చెప్పారు.