విద్యుత్ శాఖలో నష్టాలను పూడ్చేందుకే జనంపై భారం : జీవన్ రెడ్డి

విద్యుత్ శాఖలో నష్టాలను పూడ్చేందుకు ఏసీడీ ఛార్జీలు విధిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు ఏసీడీ ఛార్జీలు చెల్లించవద్దని ఆయన అన్నారు. ఈ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జీవన్ రెడ్డి తన నివాసం నుండి విద్యుత్ శాఖ ప్రగతిభవన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసనలో పాల్గొన్నారు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమేనని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రెండు పవర్ కంపెనీలు ఉంటే అందులో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పై ఏసిడి భారం లేదని చెప్పారు. కేవలం ఉత్తర తెలంగాణలో మాత్రమే ఏసీడీ ఛార్జ్ వేస్తున్నారని దీనివల్ల నార్తన్ పవన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీపై భారం పడుతోందన్నారు. 

కేసీఆర్ ఇలాకాలో ఏసీడీ చార్జెస్ లేవని జీవన్ రెడ్డి చెప్పారు. కేవలం కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో మాత్రమే ఛార్జెస్ వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనివల్ల వినియోగదారులపై రూ.40వేల కోట్లు అదనపు భారం పడుతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీని అంతమొందించేందుకు జగిత్యాల నుంచి ఉద్యమం మొదలు పెడతామని ఆయన చెప్పారు. ఏసిడి చార్జ్ రద్దు చేసి.. రైతులకు 13 గంటల విద్యుత్ అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈకి వినతి పత్రం అందజేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ధర్నా కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్పడంతో జీవన్ రెడ్డి్ ధర్నా విరమించారు.