జగిత్యాలలో కాంగ్రెస్​ నేత హత్య.. నిందితులను శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆందోళన

జగిత్యాలలో కాంగ్రెస్​ నేత హత్య.. నిందితులను శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆందోళన

తెలంగాణలో రాజకీయ కక్ష్యలు తారా స్థాయికి చేరుకున్నాయి.  జగిత్యాల రూరల్​ మండలం  జాబితాపూర్​ శివారులో ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి (53)ని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.  గంగారెడ్డి హోటల్​ నుంచి తిరిగి వస్తుండగా..  కొంతమంది దుండగులు కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచారు.  దీంతో  ఆస్పత్రికి తరలిస్తుండగా  మార్గమధ్యంలో మృతి చెందాడు.  సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

గంగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో  కాంగ్రెస్ నేతలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కాగా సంతోష్ పై పలుమార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని గంగిరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  కాంగ్రెస్ నేత గంగిరెడ్డి మృతికి నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జగిత్యాల-ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలంటూ డిమాండ్ చేశారు. తన తమ్ముడి లాంటి వ్యక్తిని దారుణంగా చంపేశారని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాలలో బీఆర్​ఎస్​ రాజ్యంనడుస్తుందా అని ప్రశ్నించారు.  గంగారెడ్డిని చంపుతానని బెదిరించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని పోలీసులను నిలదీశారు. 20 కేసులున్న రౌడీషీటర్​ తో ఎస్సైకి సంబంధాలున్నాయని జీవన్​ రెడ్డి ఆరోపించారు. ఎస్సై కాల్​ డేటా పరిశీలిస్తే రౌడీషీటర్​ తో ఎన్నిసార్లు మాట్లాడేరో తెలుస్తుందన్నారు.   కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.