స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య వచ్చే ఎన్నికల్లో తన విజయానికి సహకరిస్తారన్న నమ్మకం ఉందని స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు. 2014, 2018 ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ ఇస్తే.. ఆయన గెలుపు కోసం తాను కృషి చేశానని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీని గెలిపించేందుకు రాజయ్యతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రుల సహకారం తీసుకుంటానని తెలిపారు. గురువారం స్టేషన్ ఘన్ పూర్ లో మీడియాతో కడియం మాట్లాడారు.
‘‘ఎన్నికల టైమ్‌లో పార్టీలో చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయి. సమస్యలుంటే అవి సమసిపోతాయి. ఏ సమస్య ఉన్నా సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారు. ఈసారి కూడా ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగరేస్తాం. రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష” అని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో మూడు సీట్లకే పరిమితమైందని, కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం లేదని విమర్శించారు.
‘‘నాకు వ్యక్తిగత అజెండా లేదు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే నా అజెండా. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ కు ప్రపోజల్స్పంపాను” అని చెప్పారు.