జైపాల్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కసిరెడ్డి
- మద్దతుదారులతో ఇటీవల ఫాంహౌసలో మంతనాలు
- గ్రూపులను పట్టించుకోని హై కమాండ్
నాగర్‌కర్నూల్, వెలుగు : బీఆర్ఎస్లో వర్గపోరు రోడ్డున పడుతోంది. నాగర్ కర్నూల్ ఎపిసోడ్ ముగియక ముందే తాజాగా కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అసమ్మతి నేతలను ఏకం చేసే పనిలో పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు టికెట్ ఇస్తే ఓడిస్తామని వార్నింగులు ఇస్తున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జైపాల్‌యాదవ్ ఎవరినీ కలుపుకొని పోవడం లేదని ఎమ్మెల్సీ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఫాం హౌజ్‌లో మీటింగ్..
15 రోజుల కింద కడ్తాల్ మండల కేంద్రంలోని ఫాం హౌజ్‌లో కీలక నేతలతో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మీటింగ్ పెట్టారు. నాయకుల వ్యక్తిగత బలం, ఎంత మంది ఓటర్లను ప్రభావితం చేయగలరనే అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీతో పాటు జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, కల్వకుర్తి మాజీ సర్పంచులు బృంగి ఆనంద్ కుమార్, పసుల సుదర్శన్ రెడ్డి, ఆమనగల్లు, తలకొండపల్లి ఎంపీపీలు, సర్పంచులు, ఇతర నేతలు పాల్గొన్నారు. హై కమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. ఆదివారం కందుకూర్ ఫాం హౌజ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు 200 మంది వచ్చారు. ఈ మీటింగ్‌లో స్వరం పెంచిన లీడర్లు జైపాల్‌యాదవ్‌కు టికెట్ ఇస్తే అందరం కలిసి ఓడిస్తామని హెచ్చరించారు. కసిరెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనకు టికెట్ఇవ్వడానికి సమీకరణాలు కుదరకపోతే చిత్తరంజన్ దాస్ లేదా జడ్పీ వైస్‌చైర్మన్ బాలాజీ సింగ్పేర్లు పరిశీలించాలని ఎమ్మెల్సీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే మంత్రి కేటీఆర్ సపోర్ట్ చేస్తున్నారని, సీఎం భరోసా ఇచ్చారని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు.
అందరూ అభ్యర్థులే..
సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, సీనియర్ లీడర్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం టికెట్‌కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారంతా కలిసి ఓడిస్తారనే ప్రచారం మొదలైంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఎమ్మెల్యేల పనితీరుతో వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు.
ఉన్నోళ్లే మనోళ్లు..
కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వర్గపోరును సెటిల్ చేయకుండా హై కమాండ్ వదిలేసింది. జూపల్లి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోగా, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పదవితో పాటు పార్టీని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య విభేదాలు ముదురుతున్నా దృష్టి పెట్టడం లేదు. ఈ సారి తాను అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని ఎంపీ రాములు తన వర్గీయులతో అంటున్నారు. అచ్చంపేటలో ఎంపీ, ఎమ్మెల్యేల మొదలైన ఆధిపత్యపోరు ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఉండే వాళ్లు ఉంటారు, పోయేవాళ్లు పోతారనే అభిప్రాయంతో పార్టీ ఉందని అంటున్నారు.