- బీఆర్ఎస్కు కసిరెడ్డి గుడ్‌బై
- త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్సీ
నాగర్‌కర్నూల్, వెలుగు : బీఆర్ఎస్తో తన అనుబంధం ముగిసిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అనుచరులకు స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌తో కసిరెడ్డి సోమవారం భేటీ అయ్యారు. తనకు కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి టికెట్ ఆఫర్ చేసిన సంగతి తెలిపారు. అన్నీ విన్న కేటీఆర్ రెండు సార్లు మీకిచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోలేదు. మీ అదృష్టానికి అడ్డం పడనంటూ ఒకసారి సీఎం కేసీఆర్‌ను కలిసి వెళ్లాలని చెప్పినట్లు తెలిసింది.
త్వరలోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి, మంగళవారం వివిధ మండలాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీతో పాటు జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. 2008 నుంచి కల్వకుర్తి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్గా ఉద్యమ కాలంలో పని చేసిన తనను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏనాడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఉద్యమం కీలక దశలో డబ్బులు ఖర్చు చేసి, ఎదురుదెబ్బలను తట్టుకుని పనిచేసిన బాలాజీసింగ్‌ను కాదని 2014లో జైపాల్ యాద వ్ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో బాలాజీ సింగ్ రెబల్‌గా బరిలో నిలిచారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన కసిరెడ్డి 28 వేల ఓట్లు సాధించారు. అనంతరం బీఆర్ఎస్లో చేరి స్థానిక సంస్థల కోటాలో పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. 2018లో పార్టీ టికెట్ఆశించినా దక్కలేదు. 2023లో టికెట్వస్తుందని ఆశించినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు టికెట్ ప్రకటించడంతో కసిరెడ్డితో పాటు జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఇతర నాయకులు ఆయన కోసం పనిచేయబోమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ దొరికితే ఆయన్ను కలిసి రెండు సార్లు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలని కసిరెడ్డి భావిస్తున్నారు.
కాంగ్రెస్‌లో భారీగా చేరికలు..
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రధాన అనుచరులైన ఆమనగల్లు, కడ్తాల ఎంపీపీలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరే చాన్స్ఉంది. కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లోని జడ్పీటీసీలు, ఎంపీపీలను కదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కల్వకుర్తి మాజీ సర్పంచులు బృంగి ఆనంద్ కుమార్, పసుల సుదర్శన్ రెడ్డి, వెల్డండ పీఏసీఎస్ వైస్ చైర్మన్ సంజీవ్ యాదవ్ ఇతర కీలక నేతలు కసిరెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.